హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): అడ్వాన్స్డ్ టెక్నాలజీ, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్‌సైన్సెస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైజెస్, సైస్టెనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిషరణల కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని మెల్బోర్న్లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మెల్బోర్న్లోని మోనాష్ యూనివర్సిటీని సందర్శించారు.
అనంతరం ఉమ్మడి పరిశోధన, ఇన్నోవేషన్ బేస్డ్ కొలాబరేషన్, అకాడమిక్ ఎక్స్ఛేంజ్ , స్టార్టప్‌ల భాగస్వామ్యం తదితర అంశాలపై యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, తెలంగాణ డాటా ఎక్స్ఛేంజ్, టీ హబ్, టీ వర్స్ తదితర అంశాలపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్రంలో వినూత్న ఆవిషరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తున్నదని శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మారేందుకు అవసరమైన ఎకో సిస్టం కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు యూనివర్సిటీ అకాడమిక్ అఫైర్స్ వైస్-ప్రోవోస్ట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ వెల్లడించారు.