హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ఎలక్ట్రానిక్స్ తయారీ గ్లోబల్ హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో కోటి టెలివిజన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన ‘రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ప్రతినిధుల్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, విడిభాగాల తయారీ నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు అవసరమైన పూర్తిస్థాయి ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. రేడియంట్ సంస్థ సాధించిన ఈ ఘనత తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో ‘తెలంగాణ’ కీలక పాత్ర పోషించాలనదే తమ లక్ష్యమన్నారు. ఆ దిశగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అధిక ప్రాధాన్యతమిస్తున్నామని శ్రీధర్ బాబు వివరించారు. ఓవైపు ఎలక్ట్రానిక్స్ తయారీలో అంతర్జాతీయ దిగ్గజాలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తూనే.. మరోవైపు వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రెడీ టూ వర్ ఫోర్స్ తయారీపై దృష్టి సారించిందన్నారు.