WhatsApp | మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ కంపెనీ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు యూజర్లకు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నది. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఫీచర్ సహాయంతో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేకుండానే భారీ ఫైల్స్‌ను షేర్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉండనున్నది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌పై పని చేస్తుందని వాట్సాప్ ట్రాకర్ వాబీఇన్ఫో (WABetaInfo) తెలిపింది. ఆపిల్ అప్లికేషన్, ఎయిర్ డ్రాప్, గూగుల్ నియర్‌బై షేర్ తరహాలోనే పని చేస్తుందని పేర్కొంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వీడియోలు, ఫొటోలు, ఇతర భారీ ఫైల్స్‌ను ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు షేర్ చేయవచ్చని తెలిపింది.
మొదట ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానున్నది. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు సైతం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే, రెండు మొబైల్స్ నుంచి ఫైల్స్‌ను పంపేందుకు స్కానర్ ఉంటుంది. ఆ తర్వాత రెండుఫోన్లు కనెక్ట్ అయ్యాక ఫైల్స్‌ను సెండ్ చేసుకోవచ్చు. ఫైల్స్‌ను సెండ్ చేసుకునేందుకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదని పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ ఫోన్ నెంబర్ లేకుండానే వాట్సాప్ వాడుకునేలా అవకాశం కల్పించనున్నది. యూజర్‌నేమ్‌లు క్రియేట్ చేసి.. ఇతరులతో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచర్‌ను సైతం డెవలప్ చేస్తున్నది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి ప్రాముఖ్యతను ఇస్తూ ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. యూజర్ ఫ్రొఫైల్ ద్వారా మనకు కావాల్సిన వారిని వాట్సాప్‌లో గుర్తించేందుకు ఈ కొత్త తరహా ప్రయత్నాన్ని చేపడుతున్నారు. కేవలం ఐడెంటిటీ తెలిసినవారు, ఫోన్ నంబర్ తెలిసిన వారు మాత్రమే కొత్త తరహా ఫీచర్‌ను వాడుకునే ఛాన్స్ ఉండనున్నది.