CLRI | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆరు లెదర్ పార్క్‌ల ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులోభాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్(సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎల్ఆర్ఐ-చెన్నై)తో తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్(టీజీఎల్ఐపీసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఆరు లెదర్ పార్క్‌ల ఏర్పాటునకు సంబంధించి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కూడా రూపొందించారు. ఈ లెదర్ పార్క్‌ల్లో తోలు వస్తువులు, దుస్తులు, ఫర్నీచర్, ఫుట్‌వేర్ తదతర ఉత్పత్తులు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా పోలేపల్లి(మహబూబ్‌నగర్), దండేపల్లి(నల్గొండ), మందమర్రి(మంచిర్యాల), జింకుంట(నాగర్‌కర్నూల్), రుక్మాపూర్(కరీంనగర్), మల్లెమడుగు(ఖమ్మం) తదితర ఆరు లెదర్పార్క్ల అభివృద్ధికి ప్రభుత్వం సీఎల్ఆర్ఐతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. పీపీపీ పద్ధతిన వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే ప్రణాళికలు..
బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో పశువులు, గొర్రెల జనాభా గణనీయంగా పెరిగిన విషయం విధితమే. దీంతో మాంస వినియోగం, ఉత్పత్తిలో భారీగా వృద్ధి నమోదైంది. ముడి సరుకు కొరత లేకపోవడంతో తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా వివిధ తోలు ఉత్పత్తులు ఇక్కడే తయారు చేయాలని గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. దీంతో వేలాదిమందికి ఉపాధి లభించే అవకాశం ఉండటంతో టీజీ ఎల్ఐపీసీవో ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో లెదర్పార్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 53 ఎకరాల్లో మెగా లెదర్ క్లస్టర్‌తోపాటు భూమి లభ్యత ఉన్న 12ప్రాంతాల్లో లెదర్పార్క్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది గత సర్కారు. వీటికి అవసరమైన భూములను కూడా సిద్ధం చేసింది.