హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): అందులోకి అడుగుపెడితే ఆశ్చర్యపోతాం. సరికొత్త ఆలోచనలు మదిలో మెదిలేంతగా ఓ కొత్త అనుభూతిని పొందుతాం. అదే టీ హబ్-2 భవనం. సాండ్విచ్ ఆకారంలో కనిపిస్తూ అబ్బురపరిచేలా రూపుదిద్దుకున్న ఈ నిర్మాణంలో ఆద్యంతం అద్భుతాలే మరి.
అదరగొట్టే ఇంటీరియర్
స్టార్టప్లంటేనే సరికొత్త ఆలోచనల ప్రపంచం. నయా ఆవిష్కరణలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు జరిగే ప్రక్రియంతా స్టార్టప్ ఇంక్యుబేటర్ల వేదికగానే జరుగుతుంది. అక్కడ అడుగు ముందుకుపడితే అద్భుతాలే. కూర్చునే కుర్చీలు.. వెలిగే లైట్లు.. ఇలా ప్రతీది కొత్త ఆలోచనలకు దారితీసేలా చేస్తాయి. టీ హబ్-2లో ఈ తరహా ఇంటీరియర్ డిజైన్స్‌కు కొదవే లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 28న ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మూడు ప్రధాన విద్యా సంస్థల మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ఏర్పాటైన సంస్థ టీ హబ్. 2015లో స్టార్టప్‌లను ప్రభుత్వపరంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో దీని ప్రస్థానం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సంస్థలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన టీ హబ్‌లో చేరేందుకు రాష్ట్రం నుంచే కాకుండా దేశ, విదేశీ స్టార్టప్‌లూ పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్-2ను తెస్తున్నది.