న్యూఢిల్లీ, జనవరి 11: గతంలో ఎన్నడూలేనిరీతిలో క్యూ3 ఫలితాల సీజన్‌ను దేశంలో ఐటీ దిగ్గజ కంపెనీలు ఒకే రోజున ఆరంభించనున్నాయి. బుధవారంటీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలు.. 2021 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాల్ని వెల్లడిస్తాయి. నాల్గో పెద్ద కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు జనవరి 14 శుక్రవారం వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి ఐటీ కంపెనీల ఫలితాలపై కేంద్రీకృతమై ఉంది. డిజిటలైజేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా గత రెండు త్రైమాసికాల్లో (2021 ఏప్రిల్-జూన్, జూలై-సెప్టెంబర్) ఐటీ కంపెనీలు రికార్డుస్థాయిలో ఆదాయాల్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. తాజాగా ముగిసిన క్వార్టర్లో కూడా ఇదే ట్రెండ్‌ను ఐటీ రంగం ప్రదర్శిస్తుందని, 2022 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆదాయ వృద్ధి నమోదవుతున్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. ఐటీ కంపెనీలు వెల్లడించబోయే ఫలితాల్లో వెల్లడయ్యే కీలక అంశాలపై విశ్లేషకుల అంచనాలివి…
అమెరికాలో హాలిడే సీజన్ కారణంగా డిసెంబర్ క్వార్టర్లో సాధారణంగా ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి బలహీనంగా ఉంటుంది. అయితే కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వివిధ రంగాల కార్పొరేట్లు డిజిటలైజేషన్ కోసం భారీ వ్యయాలు చేస్తున్నందున, ఐటీ కంపెనీల ఆదాయాలు ఈ దఫా జోరుగానే ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీల ఆదాయ వృద్ధి 2021 సెప్టెంబర్ క్వార్టర్‌కంటే డిసెంబర్లో 4.5 శాతం పెరగవచ్చని బ్రోకరేజ్ సంస్థ కొటక్ ఇనిస్టిట్యూషన్ ఈక్విటీస్ పేర్కొంది. ఇన్ఫోసిస్, టీసీఎస్‌ల ఆదాయం 3.7 శాతం, 2.6 శాతం మేర పెరగవచ్చంది. 2022 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్ రెవిన్యూ గైడెన్స్‌ను 16.5-17.5 శాతం నుంచి 17-18 శాతానికి పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీసీఎస్ ప్రత్యేకంగా గైడెన్స్‌ను ప్రకటించబోదు. అయితే ఇప్పటికే ఆ కంపెనీ యాజమాన్యం 2022లో రెండంకెల ఆదాయ వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. హెచ్‌సీఎల్ టెక్ సైతం డబుల్ డిజిట్ వృద్ధి అంచనాల్ని వెల్లడించింది.
డిసెంబర్ క్వార్టర్‌కు ఐటీ సంస్థలు మెగా డీల్స్ కాకుండా తక్కువ సగటు విలువతో కూడిన ఎక్కువ డీల్స్‌ను వెల్లడిస్తాయని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ అంచనాల్లో పేర్కొంది. పలు సంవత్సరాలు అమల్లో ఉండే మల్టీ మిలియన్ డాలర్ మెగా డీల్స్‌ను గత రెండు త్రైమాసికాలుగా ఐటీ కంపెనీలు వెల్లడించడం లేదని, వాటి స్థానంలో తక్కువ సమయంలో పూర్తిచేసే, చిన్న డీల్స్‌ను అవి సంపాదిస్తున్నాయని ఎమ్కే వివరించింది. డిజిటల్ ప్రాజెక్టుల్ని త్వరితంగా పూర్తిచేయాలన్న ఆకాంక్ష ఐటీ కస్టమర్లలో కన్పిస్తున్నదని. అందుచేత చిన్న డీల్స్ ఐటీ కంపెనీలకు లభిస్తున్నాయన్నది. డీల్స్ చిన్నవైనంత మాత్రాన ఆదాయ వృద్ధి బలహీనంగా ఉంటుందని భావించరాదని, డీల్స్ అధిక సంఖ్యలో వస్తున్నందున కంపెనీలు వాటి ఆదాయాల్లో జోరు చూపిస్తాయని కొటక్ ఈక్విటీస్ అంచనాల్లో పేర్కొంది.
టెక్నాలజీ వృత్తి నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఐటీ కంపెనీల్లో వలసలు అధికస్థాయిలోనే కొనసాగుతాయని కొటక్ ఈక్విటీస్ తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంలో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో నిపుణుల వలసలు 22-25 శాతం ఉండవచ్చని, మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ వలసల రేటు 11.9 శాతం కాగా, విప్రో, ఇన్ఫోసిస్‌లు 20 శాతంగా ప్రకటించాయి. ఆ త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ నుంచి 15.7 శాతం మంది ఉద్యోగులు తరలివెళ్లారు. అంతకుముందు జూన్ త్రైమాసికంలో ఈ టాప్ ఐటీ కంపెనీల వలసలు 10-15 శాతం మధ్య ఉన్నాయి.
డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీల లాభాల మార్జిన్లు మిశ్రమంగా ఉండవచ్చన్న అంచనాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. వలసల్ని భర్తీ చేసేందుకు ఫ్రెషర్లను నియమించుకుంటున్నప్పటికీ, ప్రాజెక్టుల్ని సజావుగా పూర్తిచేయడానికి అవసరమైన నిపుణుల నియామకాలపై కంపెనీల వ్యయం పెరుగుతున్నదని, అలాగే వేతన పెంపుల్ని అమలు చేయడంతో గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే పలు ఐటీ కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
వలసలు పెరుగుతున్నందున ఐటీ కంపెనీలు తాజా నియామకాల్ని సైతం అధికం చేశాయని పరిశ్రమ విశ్లేషకులు చెపుతున్నారు. ముఖ్యంగా ప్రెషర్ల నియామకాలు పెరుగుతున్నాయన్నారు. 2022 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో ఈ రంగం నియమకాలు 18 శాతం పెరుగుతాయని ఇటీవల టీమ్‌లీజ్ సర్వీసెస్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. టాప్ ఫోర్ ఐటీ కంపెనీలు-టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.60 లక్షల మంది ప్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యాన్ని ఇప్పటికే ప్రకటించాయి.