Budget on Work from Home | మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) వార్షిక బడ్జెట్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తుది మెరుగులు దిద్దుతున్నారు. వచ్చే బడ్జెట్ ప్రతిపాదనల్లో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.50 వేల వరకు ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ రెట్టింపు అవుతుందని.. రూ.లక్షకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం అవుతున్నది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం సంస్కృతి వల్ల ఉద్యోగులకు లభిస్తున్న అలవెన్స్‌లపై పన్ను మినహాయింపునిస్తూ ఆదాయం పన్ను చట్టలో నిబంధన చేర్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.
అంతా ఊహిస్తున్నట్లు వివిధ రకాల పన్ను మినహాయింపుల్లో హయ్యర్ డిడక్షన్లతో వేతన జీవులు ఇంటికి తీసుకెళ్లే వేతనం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో పురోగతి నమోదవుతున్నదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వేతన జీవులకు ఊరట కల్పించే దిశగా చర్యలు తీసుకునే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నారని వినికిడి. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు అమల్లో ఉన్న పన్ను మినహాయింపు పరిమితి పెంచడం వల్ల వేతన జీవులకు ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తద్వారా వినియోగదారీ తత్వానికి ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ నూతన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, నూతన ఆదాయం పన్ను విధానంలో వేతన జీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ల వరకు ఏ వర్గానికి పెద్దగా బెనిఫిట్లు కల్పించచలేదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గణాంకాల మేరకు వేతన జీవుల్లో పన్ను చెల్లింపుదారుల్లో మెజారిటీ పాత ఐటీ విధానానికే మొగ్గు చూపారు. నూతన ఐటీ టాక్స్ విధానంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్లు కల్పించకపోవడం కారణంగా తెలుస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో మంత్రి నిర్మలా సీతారామన్.. ఐటీ శ్లాబ్‌లో మార్పులు చేర్పులు చేయకుండానే సరిపెట్టారు.