Home Loan | ప్రతి ఒక్కరూ తమకంటూ సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు సొంతిల్లు కొనుక్కోవాలంటే భారీ పెట్టుబడి పెట్టాలి. పెరిగిపోయిన ఖర్చులతో సొంతిల్లు కొనుక్కోవడం సాధారణ వ్యక్తులు అష్టకష్టాలు పడాలి.. వేతన జీవులైతే బ్యాంకు రుణాలతో సొంత ఇల్లు కొనుగోలు చేస్తారు. ఇంటి రుణం చెల్లింపు కొన్నేండ్ల పాటు సాగుతుంది. ప్రభుత్వం కూడా ఇండ్ల కొనుగోలును ప్రోత్సహిస్తున్నది. అందుకోసం ఆదాయం పన్ను చట్టం-1961లో పలు మినహాయింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
బ్యాంకు రుణంపై సొంతిల్లు కొనుగోలు చేసే వారికి ఆ లోన్‌పై వడ్డీ.. రుణాలపై ఆదాయం పన్ను రాయితీలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలా అవగాహన ఉంటే ఆదాయంపై పన్ను చెల్లింపు భారం తగ్గించుకోవచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సొంతిల్లు కొనుగోలు చేసే వారికి రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!
ఇంటి రుణంపై ఈఎంఐ చెల్లింపులు రెండు రకాలు. అసలు, వడ్డీ చెల్లింపు వేర్వేరుగా ఉంటాయి. ఈఎంఐలో ప్రధాన భాగం ఆదాయం పన్ను చట్టం-1961లోని 80సీ సెక్షన్ కింద మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. ఇల్లు కొనుగోలు కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును 80సీ సెక్షన్ కింద క్లయిమ్ చేయొచ్చు.
మీరు తొలిసారి బ్యాంకు రుణంపై సొంతిల్లు కొనుగోలు చేశారా.. అయితే 80ఈఈ సెక్షన్ కింద పన్ను డిడక్షన్ క్లయిమ్ చేయవచ్చు. ఈ విధానాన్ని 2016-17లో కేంద్రం పునరుద్ధరించింది. 2016-17లో తొలిసారి ఇల్లు కొనుగోలు చేసిన వారికి ఈ సెక్షన్ కింద అదనంగా రూ.50 వేల మినహాయింపు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సెక్షన్-24 కింద రూ.2 లక్షల గరిష్ట మినహాయింపునకు ఇది అదనం.