Tata Tiago ev | ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ చవకైన ఎలక్ట్రిక్ కారు టియాగో ఎలక్ట్రిక్ బుకింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఏదైనా అధీకృత టాటా మోటార్స్ డీలర్షిప్ లేదా వెబ్సైట్లో రూ. 21,000 టోకెన్ మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఈవీ కార్ల డెలివరీలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ప్రతినిధుల ద్వారా సమాచారం. టాటా టియాగో ఈవీ కార్లను గత నెల ఆఖరివారంలో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్లు కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన 10 వేల కార్లలో 2000 యూనిట్లను పాత వినియోగదారుల కోసం కేటాయించారు.
ఎలక్ట్రికల్ కార్ల మార్కెట్ వాటా పెంచుకోవడంపై కన్నేసిన టాటా మోటర్స్.. ఇప్పటికే నెక్సీన్ ఈవీ, టిగోర్ ఈవీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత నెలలో తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కారు టియాగో ఈవీ వెర్షన్‌ను ఆవిష్కరించి మంచి ఊపుమీదున్నది. టిగోర్ ఈవీ కంపాక్ట్ సెడాన్ కాగా, నెక్సాన్ ఈవీ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈవీ కారు హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌కు చెందినది.
రూ.8.49 లక్షల ప్రారంభ ధరతో టాటా టియాగో ఈవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 5 రంగుల్లో లభిస్తున్నాయి. ఇప్పటివరకు దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఇదే. ఈ ఈవీ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిమీలు దూసుకుపోతుంది. దీని డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో టియాగో బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేయడానికి కేవలం 57 నిమిషాల సమయం పడుతుందని టాటా మోటార్స్ తెలిపింది. 8 స్పీకర్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంలతో వస్తున్నది. 1.60 లక్షల కి.మీల వరకు బ్యాటరీ, మోటార్ వారంటీ ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది.