Tata Sons Chandrashekaran | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని, ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మనదేశంలో మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో నైపుణ్యం తక్కువగా ఉన్నవారు, అసలు నైపుణ్యమే లేని వారు కూడా ఉన్నత ఉద్యోగాలు చేయగలుగుతారని ఢిల్లీలో శుక్రవారం జరిగిన బీ-20 సదస్సులో చెప్పారు. నూతన డిజిటల్ చట్టంతో డేటా భద్రతతోపాటు వ్యక్తిగత గోప్యత విషయమై భారత్ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. జాబిల్లిని చేరుకోవాలన్న భారతీయుల ఆకాంక్షను చంద్రయాన్-3 విజయవంతంగా నెరవేర్చిందన్నారు. దీంతో భవిష్యత్‌లో భారత్ సాధించగల విజయాలను ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు.
`భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పలు ఉద్యోగాలు సృష్టిస్తుంది. నైపుణ్యం లేనివారిని.. కొద్దిపాటి నైపుణ్యం ఉన్నవారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. సమాచార రంగంలో నిష్ణాతుల్ని చేస్తుంది. దీంతో వారూ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయస్తారు. వివిధ రంగాల్లోని వేర్వేరు విభాగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు వైద్యుడిపై గల పని ఒత్తిడిని నర్సు తగ్గించడానికి ఏఐ సాయపడుతుంది. కొన్ని రంగాల్లో అవసరమైన సేవలకు తగిన మానవ వనరులు అందుబాటులో లేవు. ఆయా ఖాళీలను ఏఐతో భర్తీ చేయొచ్చు` అని చంద్రశేఖరన్ తెలిపారు.
నూతన డిజిటల్ చట్టంతో వ్యక్తిగత గోప్యత పరిరక్షణలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని చంద్రశేఖరన్ తెలిపారు. డేటా భద్రతతోపాటు వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకూడదని నూతన డిజిటల్ చట్టం ద్వారా కేంద్రం విధి విధానాలు ఖరారు చేసింది. థర్డ్ పార్టీలకు ఇచ్చే డేటా సేఫ్టీ కోసం డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ (డెపా) తెచ్చిందన్నారు. ఈ రెండింటి కలయికతో కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నప్పుడైనా, ఇతరులతో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకున్నప్పుడైనా వారి డేటాకు భద్రత ఉంటుందన్నారు.