Tata Nexon | టాటా మోటార్స్ (Tata Motors) సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ (SUV) టాటా నెక్సాన్ (Tata Nexon) మరో మైలురాయిని చేరుకున్నది. ఇప్పటి వరకూ ఏడు లక్షల యూనిట్లు విక్రయించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్లు, షోరూమ్ల వద్ద ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా నెక్సాన్ (మోడల్, వేరియంట్ ఆధారంగా) కార్లను బుక్ చేసుకుని డెలివరీ కోసం వేచి చూస్తున్న వారికి రూ.లక్ష వరకూ బెనిఫిట్లు కల్పిస్తున్నది. ఈ బెనిఫిట్లు ఈ నెలాఖరు వరకూ కార్లు బుక్ చేసుకున్న వారికీ వర్తిస్తాయి. టాటా నెక్సాన్ నాలుగు వేరియంట్లు – స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్ వేరియంట్లలో లభిస్తుంది. టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్ వర్షన్ మోడల్ క్రియేటివ్, ఫియర్లెస్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు టాటా నెక్సన్ కారు ఏడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
టాటా నెక్సాన్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 118 బీహెచ్పీ విద్యుత్, 170 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 113 బీహెచ్పీ విద్యుత్, 260 ఎన్ఎం టార్క్ వెలువరించడంతోపాటు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 2017 సెప్టెంబర్ 21న తొలిసారి టాటా నెక్సాన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. 2023 సెప్టెంబర్ లో టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ కారు మార్కెట్లోకి తీసుకొచ్చింది టాటా మోటార్స్.