Tata Altroz-Punch CNG | ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ వెహికల్స్.. ప్రత్యేకించి తక్కువ ధరతో ఎక్కువ మైలేజీనిచ్చే కార్ల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కస్టమర్ల ఆకాంక్షలను గమనిస్తున్న కార్ల తయారీ సంస్థలు కూడా అదే రూట్లో అడుగులేస్తున్నాయి. సీఎన్జీ వేరియంట్ కార్లను మార్కెట్లోకి తేవడానికి పోటీ పడుతున్నాయి. దేశీయ కార్ల మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న టాటా మోటార్స్ ఆ పోటీలో ముందున్నట్లు సంకేతాలిస్తున్నది. ఇప్పటికే పాపులర్ మోడల్ కార్లుగా ఉన్న పంచ్, ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నట్లు ప్రకటించింది.
వచ్చే జూన్‌లో పంచ్ సీఎన్జీ, ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ కార్లు దేశీయ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. ఇటీవలే ముగిసిన ఆటో ఎక్స్‌పోలో కూడా ఈ రెండు కార్లను ప్రదర్శించింది టాటా మోటార్స్. గతేడాది ఫిబ్రవరిలో టియాగో సీఎన్జీ, టైగోర్ సీఎన్జీ వేరియంట్ కార్లు ఆవిష్కరించింది. మారుతి బాలెనో సీఎన్జీ, టయోటా గ్లాంజా సీఎన్‌జీలతో ఆల్ట్రోజ్ సీఎన్జీ పోటీ పడనున్నది. మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ కారు పంచ్ తొలి సీఎన్జీ వేరియంట్ కానున్నది.
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ, పంచ్ సీఎన్జీ కార్లు ట్విన్ సిలిండర్ ట్యాంక్ సెటప్‌తో వస్తున్నాయి. ఈ రెండు కార్లలోనూ 60 లీటర్ల ఇంధన కెపాసిటీ ఉంటుంది. అయినా రెండు కార్ల బూట్ స్పేస్‌లో ఏమాత్రం తేడా ఉండదు. దీనిపై టాటా మోటార్స్ అధికారికంగా స్పందించలేదు. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్లో 345 లీటర్ల బూట్ స్పేస్, పంచ్ పెట్రోల్ వేరియంట్లో 366 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది.
ఆల్ట్రోజ్-పంచ్ పెట్రోల్ వేరియంట్లలో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. 84 బీహెచ్పీ పవర్, 113 ఎన్ఎం టార్చి దీని సామర్థ్యం. సీఎన్జీ వేరియంట్ ఇంజిన్లలో 76 బీహెచ్పీ పవర్, 97 ఎన్ఎం టార్చి వెలువరించే సామర్థ్యం కలిగి ఉంటుంది. రెగ్యులర్ పెట్రోల్ వేరియంట్ కార్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తోపాటు 5-స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటది. టియాగో ఐ-సీఎన్జీ వేరియంట్ కారు మాదిరే ఆల్ట్రోజ్ అండ్ పంచ్ సీఎన్జీ వేరియంట్ కార్ల ఇంజిన్‌తో కిలో సీఎన్జీ గ్యాస్‌తో 26-27 కి.మీ. మైలేజీ సామర్థ్యం ఉంటుందని ప్రకటిస్తున్నది టాటా మోటార్స్.
పెట్రోల్ కార్లలో మాదిరిగానే టాటా ఆల్ట్రోజ్ అండ్ పంచ్ సీఎన్జీ వేరియంట్ కార్లలో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆటోమేటిక్ ఏసీ, రివర్స్ పార్కింగ్ కెమెరా, 7-అంగుళాల టీఎఫ్టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7-ఇంచ్ హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్ విత్ పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ ఉంటాయి. వీటితోపాటు క్రూయిస్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, లెథర్ అప్హోల్స్టరీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఆర్-16 డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ ఆంటేనా, ఆటో ఫోల్డింగ్ ఓఆర్వీఎం తదితర ఫీచర్లు కూడా జత కలిశాయి. వీటితోపాటు సేఫ్టీ కోసం 6-ఎయిర్ బ్యాగ్స్, సన్‌రూఫ్ ఫీచర్లు జోడిస్తున్నది టాటా మోటార్స్.
పెట్రోల్ వేరియంట్ కార్లతో పోలిస్తే ఆల్ట్రోజ్-పంచ్ సీఎన్జీ వేరియంట్ కార్ల ధరలు రూ.లక్ష ఎక్కువగా ఉండొచ్చు. ఆల్ట్రోజ్ కారు ప్రస్తుతం రూ.6.35 లక్షల నుంచి రూ.10.25 లక్షల మధ్య లభిస్తుంది. పంచ్ పెట్రోల్ వేరియంట్ కారు రూ.6-9.54 లక్షల మధ్య పలుకుతున్నది.