Crime News : అమెరికా (USA) లో మరో భారత జాతీయుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. టెన్నెస్సీ రాష్ట్రం (Tennessi State) లోని జాక్సన్ నగరంలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ (Gujarat) కు చెందిన 56 ఏళ్ల సురేష్ పటేల్ (Suresh Patel).. తన కుమార్తెతో కలిసి షాపులో ఉండగా ఈ దాడి జరిగింది. కుమార్తె కళ్లెదుటే తండ్రిని దుండగుడు కాల్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జాక్సన్ పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో సురేష్ పటేల్‌కు చెందిన ‘రిడ్జ్‌క్రెస్ట్ సెల్లార్స్’ అనే మద్యం దుకాణంలోకి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు తీసుకున్న అనంతరం నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేష్ పటేల్ అక్కడికక్కడే మృతిచెందారు. సురేష్ పటేల్ ఇటీవల కాలంలోనే ఈ దుకాణాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు గ్రే కలర్ హూడీ, జీన్స్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఘటన అనంతరం నిందితుడు తెల్లటి కారులో పరారయ్యాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.