న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) ధరలు తగ్గాయి. ఆయా మాడళ్లపై ఏకంగా రూ.3 లక్షలదాకా తగ్గించినట్టు మంగళవారం సంస్థ ప్రకటించింది. పాపులర్ మాడల్ నెక్సాన్ ఈవీ రేటు రూ.3 లక్షల వరకు దించినట్టు సంస్థ తెలియజేసింది. అలాగే పంచ్ ఈవీ ధరపై రూ.1.2 లక్షలదాకా, టియాగో ఈవీపై రూ.40,000 వరకు తగ్గింపులనిస్తున్నట్టు పేర్కొన్నది. ‘ఈ ప్రత్యేక, పరిమిత కాల ధరల తగ్గింపుతో ఈవీలనూ పెట్రోల్/డీజిల్ కార్ల ధరలకు దగ్గరగా తీసుకెళ్తున్నాం’ అని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్సవ అన్నారు. అంతేగాక తమ ఈ నిర్ణయంతో రెగ్యులర్ కార్ల కొనుగోలుదారులూ ఈవీలను ట్రై చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన కనబర్చారు. నిజానికి ఇప్పటికే టియాగో, నెక్సాన్, హరియర్, సఫారీ వంటి మాడళ్ల ధరల్ని టాటా మోటర్స్ రూ.65,000ల నుంచి రూ.1.8 లక్షల వరకు తగ్గించింది. ఈ క్రమంలో ఈవీల రేట్లనూ భారీగా కోత పెట్టింది. దీంతో ఈ పండుగ సీజన్లో టాటా అమ్మకాలు మరింత పెరగడం ఖాయమన్న అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో ఉన్నాయి. పైగా ప్రస్తుతం ఈవీ మార్కెట్లో టాటా మోటర్స్దే పైచేయి. తాజా ప్రకటనతో టాటా ఈవీల సేల్స్ ఇంకా పుంజుకుంటాయన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి.
సియామ్ అధ్యక్షుడిగా శైలేశ్ చంద్ర
సియామ్ కొత్త అధ్యక్షుడిగా టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఎన్నుకున్నట్టు సియామ్ అధికారికంగా ప్రకటించింది. 2024-25కుగాను ఈయన ఎంపిక జరిగింది. కాగా, గతంలో సియామ్ ఉపాధ్యక్షుడిగా చంద్ర పనిచేశారు. ఇప్పటిదాకా వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ ఎండీ, సీఈవో వినోద్ అగర్వాల్ ఉన్నారు. ఈయన స్థానంలోకి చంద్ర వస్తున్నారు. ఇక సియామ్ ఉపాధ్యక్షుడిగా అశోక్ లేలాండ్ ఎండీ, సీఈవో శేను అగర్వాల్, కోశాధికారిగా దైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికిల్స్ సీఈవో సత్యకమ్ ఆర్య ఎన్నికయ్యారు.