Tata Motors | వచ్చేనెల ఒకటో తేదీ నుంచి టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగనున్నాయి. కార్ల తయారీలో వాడే ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ ధరలు పెరగడంతో అన్ని కార్ల ధరలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి సగటున 1.2 శాతం పెంచనున్నట్లు శుక్రవారం తెలిపింది. పెరిగిన ఖర్చుల్లో గణనీయ భాగం వివిధ చర్యల ద్వారా సర్దుబాటు చేశామని తెలిపింది. ఓవరాల్‌గా ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోవడంతో కొంత భారం వినియోగదారులపై మోపక తప్పడం లేదని పేర్కొంది. వేరియంట్లు, మోడల్స్ వారీగా టాటా మోటార్స్ కార్ల ధరలు సగటున 1.2 శాతం పెరగనున్నాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. నెక్సాన్, హారియర్, సఫారీ, పంచ్ తదితర మోడల్ కార్లను దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ విక్రయిస్తున్నది.
టాటా మోటార్స్ షేర్ శుక్రవారం 6.34 శాతం పెరిగి రూ.445.55 పలికింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.3,043 కోట్లు సంపాదించినట్లు సంస్థ తెలిపింది. దీంతో టాటా మోటార్స్ స్క్రిప్ట్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 8.16 శాతం లబ్ధితో రూ.453.20లకు చేరుకుంది. మరోవైపు ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 6.25 శాతం వృద్ధి చెంది ముగింపు దశకు రూ.445.25 వద్ద ముగిసింది. ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీల్లో టాటా మోటార్స్ భారీగా లబ్ధి పొందింది. బీఎస్ఈలో టాటా మోటార్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,819.46 కోట్లు పెరిగి రూ.1,47,981.46 కోట్లకు దూసుకెళ్లింది.