Tata iPhone | న్యూఢిల్లీ, జూలై 11: దేశీయ బహుళ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ నుంచి ఇక మార్కెట్లోకి ఐఫోన్లు రానున్నాయి. తొలి భారతీయ ఐఫోన్ తయారీదారన్న ఘనతను టాటాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో యాపిల్ కంపెనీకి సప్లయర్‌గా ఉన్న విస్ట్రన్ సంస్థకు చెందిన కర్ణాటక ప్లాంట్‌ను టేకోవర్ చేసే దిశగా టాటా గ్రూప్ వెళ్తున్నది మరి. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం కూడా జరుగవచ్చని అంటున్నారు. కాగా, ఈ ప్లాంట్ విలువ 600 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 10వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 14 మోడల్‌నూ ఇక్కడ తయారుచేశారు. ఇక ఈ ప్లాంట్ నుంచి వచ్చే ఏడాది మార్చికల్లా కనీసం 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను బయటకు తీసుకురావాలని విస్ట్రన్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే సంస్థ ఉద్యోగులనూ 30వేలకు పెంచాలని చూస్తున్నది. అయితే టాటా వీటన్నిటికీ అంగీకరిస్తే.. భారతీయ ఐఫోన్ వ్యాపారం నుంచి విస్ట్రన్ వైదొలుగుతూ డీల్‌ను ఓకే చేయవచ్చని చెప్తున్నారు.
ఆసియాలో కేవలం చైనాకే పరిమితం కాకుండా భారత్‌నూ తమ ఐఫోన్ల తయారీకి ప్రధాన కేంద్రంగా మార్చుకోవాలని యాపిల్ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాటాలు సప్లయర్‌గా వస్తే మార్కెట్ వాటాను త్వరగా పెంచుకోవడానికి యాపిల్‌కు అనుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ ఏప్రిల్-జూన్‌లో భారత్ నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను విస్ట్రన్ ఎగుమతి చేసింది. యాపిల్ సప్లయర్లుగా విస్ట్రన్తోపాటు ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగట్రాన్ కార్ప్లూ ఉన్న సంగతి విదితమే.
155 ఏండ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూప్.. ఉప్పు నుంచి ఉక్కు దాకా, హెయిర్ పిన్ను నుంచి ఏరోప్లేన్ వరకు అన్నింటిలో ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ తయారీ, ఈ-కామర్స్ రంగాల్లోకి ప్రవేశించాలని టాటా గట్టిగా ప్రయత్నిస్తున్నది. ఇక ఆయా రాష్ర్టాల్లో సంస్థకున్న వందలాది ఎకరాలు.. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకూ కలిసిరానున్నాయి. మరోవైపు చిప్ తయారీపైనా ఆసక్తి ఉన్నట్టు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇప్పటికే ప్రకటించినది తెలిసిందే.