Tata Cars : టాటా కార్ల ధరల్ని పెంచబోతున్నట్లు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెరగనున్నాయి. మోడల్, వేరియెంట్‌ను బట్టి గరిష్టంగా రూ.25,000 వరకు కార్ల ధరల పెంపు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి తమ ప్యాసింజర్ వెహికల్స్ ధరలు పెరుగుతాయని వెల్లడించింది.
యూనిఫాం ధరల పెరుగుదలని కంపెనీ ప్రకటించలేదు. అంటే, ఒక్కో వేరియెంట్‌పై ఒక్కో రకమైన పెంపు ఉండొచ్చు. టాటా మోటార్స్ సంస్థ ఈ ఏడాదిలో కార్ల ధరల్ని పెంచడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలు పెరగగా, ఆ తర్వాత జూలై 1 నుంచి మరోసారి ధరల పెంపును టాటా మోటార్స్ అమలు చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి మూడోసారి ధరల్ని పెంచబోతుంది. ఏప్రిల్‌లో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వెహికల్స్ ధరల్ని 0.5 శాతం పెంచింది. పెట్రోల్, డీజిల్.. రెండు రకాల వాహనాలపై ధరల్ని పెంచింది.
ఆ తర్వాత జూలై 1 నుంచి మరో 1.5 శాతం ధరల్ని పెంచింది. టాటా మోటార్స్‌తోపాటు ఇతర వాహన సంస్థలు కూడా తమ ధరల్ని పెంచుతున్నాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా సంస్థ కూడా ఈ ఏడాది మూడుసార్లు ధరలు పెంచింది. చివరగా గత బుధవారం ధరల పెంపుపై ప్రకటన చేసింది. ఆ తర్వాత మారుతి సుజుకి సంస్థ కూడా తమ కార్ల ధరల్ని ఇటీవలి కాలంలో పెంచింది. ధరల పెరుగుదల నేపథ్యంలో టాటా కార్స్ కొనాలనుకుంటున్న వినియోగదారులు సెప్టెంబర్ 1 కంటే ముందు.. అంటే, ఈ నెల చివరిలోపు కార్లు కొనుక్కోవడం మంచిది. పెరగబోయే ధరల భారం నుంచి అప్పుడే తప్పించుకోవచ్చు.