Tata Motors | కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం రెండోదశ బీఎస్-6 ప్రమాణాలను అమలు చేయాలని నిర్దేశించడంతో కార్ల తయారీ సంస్థలు వివిధ మోడల్ కార్ల ధరలు పెంచేశాయి. మరోవైపు, కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, క్యాష్ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ కొన్ని ఎంపిక చేసిన కార్లు, ఎస్‌యూవీలపై డిస్కౌంట్లు, బెనిఫిట్లు ఆఫర్ చేసింది. ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్ తదితర రూపాల్లో ధరలు తగ్గించింది. టియాగో, టైగోర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ మోడల్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. కానీ పాపులర్ ఎస్యూవీ కార్లు పంచ్, నెక్సాన్తోపాటు అన్ని వేరియంట్ల ఎలక్ట్రిక్ కార్లపై మాత్రం డిస్కౌంట్లు ఆఫర్ చేయడం లేదు.
ఈ నెలలో టాటా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ కార్లు హారియర్, నెక్సాన్ లపై గరిష్టంగా రూ.35 వేల డిస్కౌంట్ ప్రకటించింది. రెండు మోడల్ కార్లపై ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూపంలో రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.10 వేల ధర తగ్గించింది. ఈ ఎస్‌యూవీలపై ఎటువంటి కన్జూమర్ బెనిఫిట్ స్కీములు ప్రకటించలేదు.
2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తున్న టాటా సఫారీ.. 170 హెచ్‌పీల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. హ్యుండాయ్ అల్కాజర్, ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది. టాటా సఫారీ కారు రూ.15.65-25.02 లక్షలు, టాటా హారియర్ రూ.15-24.07 లక్షల మధ్య ధర పలుకుతుంది.
టాటా టైగోర్ కారుపై గరిష్టంగా రూ.33 వేల వరకు బెనిఫిట్లు కల్పిస్తున్నది. ఆటోమేటిక్, సీఎన్జీ వేరియంట్ కార్లపై కన్జూమర్ బెనిఫిట్ రూపంలో రూ.15 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేల ధర తగ్గిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ పై కన్జూమర్ డిస్కౌంట్ రూ.20 వేలతోపాటు మొత్తం రూ.30 వేల రాయితీ కల్పిస్తున్నది. అదనంగా కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 అందిస్తున్నది.
హోండా అమేజ్, మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ ఔరా కార్లతో సెడాన్ టైగోర్ పోటీ పడుతుంది. దీని ధర రూ.6.30లక్షల నుంచి రూ.8.90 లక్షల మధ్య పలుకుతుంది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్ బాక్స్‌తో వస్తున్నది.
టాటా టియాగో కారుపై గరిష్టంగా రూ.30 వేల బెనిఫిట్లు అందిస్తున్నది. దాదాపు అన్ని వేరియంట్లపై కన్జూమర్ స్కీమ్ బెనిఫిట్ రూ.15 వేలు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు లభిస్తున్నది. ఎక్స్ టీ, ఎక్స్ టీ రిథమ్, ఎన్ఆర్జీ మాన్యువల్, ఎక్స్ జడ్ + పెట్రోల్ వేరియంట్లపై కన్జూమర్ బెనిఫిట్ రూ.20 వేలతో మొత్తం రూ.30 వేల రాయితీ కల్పిస్తున్నది. సీఎన్జీ వేరియంట్లపై కన్జూమర్ బెనిఫిట్ రూ.10 వేలతో మొత్తం రూ.20 వేల రాయితీ లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ కార్లపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5000 వరకు పొందొచ్చు.
టోగోర్ మాదిరిగానే టియాగో కూడా ఒకే పవర్ ట్రైన్ ఆప్షన్ లో లభిస్తుంది. మారుతి స్విఫ్ట్, మారుతి ఇగ్నిస్, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోటీ పడుతుంది. దీని ధర రూ.5.60-8.11 లక్షల మధ్య పలుకుతుంది.
టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ వేరియంట్ కారుపై గరిష్టంగా రూ.28 వేల రాయితీలు కల్పిస్తున్నది. కన్జూమర్ బెనిఫిట్ రూ.10,000-15,000, సెలెక్టెడ్ వేరియంట్లపై రూ.10 వేల ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్ ఎంటీ వేరియంట్ కారుపై రూ.10 వేలు, పెట్రోల్ డీసీటీ అండ్ డీజిల్ వేరియంట్లపై కన్జూమర్ బెనిఫిట్ రూ.15,000, అన్ని వేరియంట్లపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 లభిస్తుంది.
టాటా ఆల్ట్రోజ్ మూడు ఇంజిన్ వేరియంట్లలో లభ్యం అవుతున్నది. 1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్, 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.60 లక్షల నుంచి రూ.10.50 లక్షల మధ్య పలుకుతుంది. హ్యుండాయ్ ఐ20, టయోటా గ్లాంజా, మారుతి సుజుకి బాలెనో మోడల్ కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.