Tata Altroz vs Maruti Baleno | పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్జీ గ్యాస్ వేరియంట్ కార్లు ఎక్కువ మైలేజీ ఇస్తున్నాయి. ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో దాదాపు కార్ల తయారీ సంస్థలన్నీ సీఎన్జీ వేరియంట్ కార్ల విడుదలకు మొగ్గు చూపుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకితోపాటు టాటా మోటార్స్, హ్యుండాయ్ తదితర సంస్థలు కూడా ఆయా మోడల్ కార్లను సీఎన్జీ వేరియంట్లలో ఆవిష్కరిస్తున్నాయి.
ఇటీవలే టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు ఆవిష్కరించింది. అంతేకాదు ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో ఆల్ట్రోజ్ సీఎన్జీని విడుదల చేసిన తొలి సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ, మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ కారు బాలెనో సీఎన్జీ మధ్య ధరవరల్లో తేడాలు, ఏ మోడల్ ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసుకుందాం..
టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ గత మే నెలలో ఆవిష్కరించారు. దీని ధర రూ.7.55 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ కారు ధర రూ.10.55 లక్షలు పలుకుతుంది. టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు ఎక్స్ఈ, ఎక్స్ఎం+, ఎక్స్ఎం+ (ఎస్), ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్+ (ఎస్), ఎక్స్‌జడ్+ ఓ (ఎస్) వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు 1.2 లీటర్ల రివట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 72.4 బీహెచ్పీ, 103 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో నడుస్తుంది. ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు కిలో సీఎన్జీ గ్యాస్‌పై 26.20 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిన్ సన్ రూఫ్ గల సీఎన్జీ వేరియంట్ కారు టాటా ఆల్ట్రోజ్ ఒక్కటే.
మారుతి సుజుకి బాలెనో ఎస్-సీఎన్జీ వేరియంట్ కిలో సీఎన్జీ గ్యాప్‌పై 30.61 కి.మీ మైలేజీ ఇస్తుంది. టాటా ఆల్ట్రోజ్ మాదిరిగానే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తోనే నడుస్తుంది. 1.2 లీటర్ల కెపాసిటీ గల కే-సిరీస్ ఇంజిన్‌తో నడిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 76.4 బీహెచ్పీ విద్యుత్, 98.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
మారుతి సుజుకి బాలెనో సీఎన్జీ వేరియంట్ తో పోలిస్తే టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు మైలేజీ తక్కువ ఇస్తుంది. ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు ధర రూ.7.55 లక్షల నుంచి ప్రారంభమైతే.. మారుతి బాలెనో సీఎన్జీ వేరియంట్ రూ.8.35 లక్షల నుంచి మొదలవుతుంది. బేస్ మోడల్ కార్ల ధరల ప్రకారం టాటా ఆల్ట్రోజ్ సుమారు రూ.80వేలు తక్కువ ధర పలుకుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ కార్లలో మారుతి బాలెనో కంటే ఆల్ట్రోజ్ కారు రూ.1.25 లక్షలు తక్కువకే లభిస్తుంది.