US Tariffs | భారత్-అమెరికా మధ్య సుంకాల వివాదం రాబోయే రెండు నెలల్లో పరిష్కారమవుతుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) వీ అనంత నాగేశ్వరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌పై విధించిన సుంకాలను అమెరికా ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగుమతిదారులకు ఊరట కలిగించేలా పరస్పర సుంకాలను 25శాతం నుంచి దాదాపు 15శాతానికి తగ్గించేందుకు చర్చలు జరగుతున్నాయని నాగేశ్వరన్ తెలిపారు. కోల్‌కతాలో మర్చంట్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో సీఈఏ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు సమాచారం ఏదీ లేదని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. రాబోయే రెండు నెలల్లో సుంకాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. యూఎస్ విధించిన సుంకాలకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని.. ఈ దిశగా రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. సుంకాలు 10శాతం, 15శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల విలువ 850 బిలియన్ డాలర్లు ఉండగా.. రాబోయే రోజుల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని.. జీడీపీల్లో ఎగుమతుల వాటా 25శాతంగా ఉందన్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచిస్తోందని నాగేశ్వరన్ తెలిపారు.
అయితే, ఇటీవల అమెరికా భారత్ ఎగుమతులపై 50శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు సుంకాలు విధించినట్లుగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. అమెరికా ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో తలుపు తెరవకపోవడమే ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఒత్తిడితో భారత ప్రభుత్వం పత్తిపై కొంత వరకు సడలింపు ఇచ్చింది. విదేశీ పత్తి దిగుమతులపై 11శాతం సుంకాన్ని తొలగించింది. అమెరికా సుంకాలపై ఇప్పటికే ప్రధాని మోదీ వైఖరి స్పష్టం చేశారు. దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో ఒత్తిడి పెరిగినా భరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. యూఎస్-భాత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై గత మంగళవారం చర్చలు మొదలయ్యాయి. వాణిజ్య ఒప్పందం తొలి దశను ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారు.