హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు రూబ్రిక్స్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ-హబ్ నిర్వాహకులు తెలిపారు. ప్రోటోటైప్ దశ నుంచి కనిష్ఠ ఆచరణీయ ఉత్పత్తి (మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్ దశ-ఎంవీపీ) వరకు ఆయా స్టార్టప్‌లకు ఈ కార్యక్రమంలో అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామన్నారు. 20 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆలోచన దశ నుంచి ఉత్పత్తులను రూపొందించే దశ వరకు నిపుణులు చేయూతనిస్తారు. ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టార్టప్‌లకు ప్రోటోటైప్, ఎంవీపీ దశలు అత్యంత కీలకం. ఇక్కడే చాలా స్టార్టప్‌లు ముందడుగు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దీన్ని అధిగమించేందుకు టీ-హబ్ కొత్తగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.