హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ, ఆవిష్కరణ విభాగాల్లో కలిసి పనిచేసేందుకు ఇండో ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐఎఫ్‌సీసీఐ)… టీ హబ్‌తో జత కట్టింది. ఇందుకు సంబంధించి శుక్రవారం టీహబ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఐఎఫ్‌సీసీఐ అధ్యక్షులు సుమీత్ ఆనంద్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్లు పరస్పరం ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ఏడాది పాటు అమలులో ఉండే విధంగా ఈ ఒప్పందం ద్వారా ఇండియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఐఎఫ్‌సీసీఐ, టీహబ్ కలిసి ప్రత్యేక ఈవెంట్లతో పాటు వర్క్‌షాపులను కూడా నిర్వహిస్తూ సరికొత్త ఆవిష్కరణలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
టీ హబ్‌లో ఐఎఫ్‌సీసీఐ కార్యాలయం…
ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణ కేంద్రంగా ఉన్న టీ హబ్‌లో ఐఎఫ్‌సీసీఐ హైదరాబాద్ చాప్టర్‌ను ఈ సందర్బంగా ప్రారంభించారు. బెంగళూరు కేంద్రంగా ఉన్న కౌన్సుల్ జనరల్ ఆఫ్ ఫ్రాన్స్ థైరీ బెర్తెలాట్, ఐఎఫ్‌సీసీఐ డైరెక్టర్ జనరల్ పాయల్ ఎస్ కన్వర్, బ్రిక్స్ యాక్సెస్ చైర్మన్ గెరార్డ్ వూల్ఫ్ల సమక్షంలో నూతన కార్యాలయం ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఐఎఫ్‌సీసీఐ అధ్యక్షులు, ఇండ్సైట్ గ్రోత్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు సుమీత్ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన కొత్త చాప్టర్‌తో ఫ్రెంచ్ నుంచి పెద్ద మొత్తంలో నగరానికి పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఎన్నో అనుకూలతలు ఉన్న నగరంలో తమ చాప్టర్ విజయవంతంగా సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భారత దేశంలో ఫ్రాన్స్ రాయబారి ఎమానుయ్యేల్ లెనైన్, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి పౌల్ హెర్మిలిన్, టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, టీ హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ పన్నీర్ సెల్వం మదనగోపాల్ తదితరులు పాల్గొన్నారు.