హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): టీ హబ్..హైదరాబాద్ ఏంజిల్స్‌తో జతకట్టింది. స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి పెట్టుబడులు ఆకర్శించడంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించి మంగళవారం టీ హబ్‌లో హైదరాబాద్ ఏంజిల్స్ చైర్మన్ రాజేశ్ మంతెన, టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఏంజిల్స్ చైర్మన్ రాజేశ్ మాట్లాడుతూ…ఇప్పటి వరకు 60కి పైగా స్టార్టప్స్‌లో హైదరాబాద్ ఏంజిల్స్ పెట్టుబడులను పెట్టిందని, స్టార్టప్‌ల కార్యకలాపాలు విజయవంతంగా ముందుకు సాగాలంటే నిధులు ఎంతో కీలకం. ఈ విషయంలో తమ సంస్థ కీలంగా వ్యవహరిస్తోందన్నారు. తాజాగా టీ హబ్‌తో కలిసి స్టార్టప్‌ల కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీ హబ్ సీఈవో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టీ హబ్ ద్వారా సుమారు 2 వేలకు పైగా స్టార్టప్‌లకు ఆర్థిక సహకారం అందించామని, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడి సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు.