హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ప్రపంచ స్టార్టప్ చరిత్రలో టీ-హబ్‌కు ఒక అధ్యాయం దక్కింది. జపాన్‌లో జరిగిన సిటీ టెక్-టోక్యో ఈవెంట్లో టీ-హబ్‌కు చెందిన 9 స్టార్టప్‌లు విశేష ఆదరణ పొంది గ్లోబల్ స్థాయిని అందుకున్నాయి. దేశవ్యాప్తంగా అనేక స్టార్టప్స్‌తో పోటీపడి ఈ ఈవెంట్లో టీ-హబ్ భారత్ తరఫున ఏకైక ప్రతినిధిగా నిలిచింది.
ఈ ఈవెంట్‌ను ఫిబ్రవరి 27, 28 తేదీలలో జపాన్‌లో నిర్వహించారు. 30 దేశాల నుంచి ప్రతినిధి బృందాలు పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 70 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా, టీ-హబ్‌కు చెందిన 9 స్టార్టప్‌లు ఎంపికై యావత్తు దేశానికే ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని టీ-హబ్‌కు తెచ్చిపెట్టాయి. టీ-హబ్ సీఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సిటీ టెక్-టోక్యో ఈవెంట్లో టీ-హబ్ భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
జపనీస్ మార్కెట్లో టీ-హబ్ స్టార్టప్‌లను విస్తరించడంతోపాటు, పలు కంపెనీల భాగస్వాములు, పెట్టుబడిదారులు, కస్టమర్లతో కనెక్ట్ అవడానికి ఇది స్ఫూర్తిగా నిలుస్తున్నదన్నారు. కాగా, ఎంపికైన టీ-హబ్ స్టార్టప్‌ల్లో ఇన్వెండెంట్ ఇన్సైట్స్, గ్రేమాటిక్స్, ఫ్లైట్టా, జెన్డెవెక్స్, లాండీడ్, హాలా, ఇంటర్వ్యూ డెస్క్, కోనీయో, స్టాట్విగ్ ఉన్నాయి.