ఐటీలో హైదరాబాద్ మేటి
ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. మౌలిక వసతుల కల్పన, మానవ వనరులు, సుస్థిరత కారణంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నది.
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రగతి బాట
- గణాంకాలతో రుజువు చేసిన సామాజిక ఆర్థిక సర్వే-2026
- దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో 20% ఇక్కడే
- టీ-హబ్, వీ-హబ్‌లతో ఔత్సాహికులకు చేయూత
- యువతలో నైపుణ్యాల పెంపునకు ‘టాస్క్’
- డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీకి టీ-ఫైబర్ అని కితాబు
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నది. మౌలిక వసతుల కల్పన, మానవ వనరులు, సుస్థిరత కారణంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీసుకొచ్చిన పాలసీలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు, కేటీఆర్ విజన్ వెరసి.. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే మేటిగా విరాజిల్లుతున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘సామాజిక ఆర్థిక సర్వే-2026’ సైతం పదేండ్ల బీఆర్ఎస్ పాలనా ప్రగతిని గణాంకాలతో రుజువు చేసింది. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలు అద్భుత ఫలితాలు ఇవ్వడంతో, ఐటీ రంగంలో రాష్ర్టాన్ని లీడర్‌గా నిలిపినట్టు ఈ సర్వే కితాబు ఇవ్వడం గమనార్హం.
జీసీసీలకు అడ్డాగా..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)కి హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారిందని, నగరంలో 1,500 ఐటీ, దాని అనుబంధ కంపెనీలున్నట్టు సర్వేలో తేలింది. ఇందులో మల్టీ నేషనల్ కంపెనీలతోపాటు, చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. 2023-24నాటికి రూ.2,68,223 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగగా, 2024-25కు ఇవి రూ.3,12,941 కోట్లకు చేరాయి. అయితే 2023-24లో 9,46,285 మంది ఐటీ రంగంలో ఉపాధి పొందగా, 2024-25కి ఈ సంఖ్య 9,39,054కి తగ్గినట్టు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో 7,231 ఉద్యోగాలు తగ్గిపోయాయన్నమాట. కాగా, దేశంలో 1,700 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) ఉన్నట్టు నాస్కమ్, జొన్నొవ్లు విడుదల చేసిన ‘ఇండియా జీసీసీ ల్యాండ్‌స్కేప్ రిపోర్టు’ వెల్లడించింది. వీటిల్లో 19 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నట్టు వివరించింది. బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, ముంబై-ఎన్సీఆర్లో కీలక జీసీసీలున్నట్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ జీసీసీలకు హబ్‌గా నిలిచిందని ఈ సర్వే తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో 20% నగరంలోనే ఉన్నట్టు వెల్లడించింది మరి. ఉన్నతస్థాయి మౌలిక సదుపాయాలు, బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు, టాలెంట్ పూల్ కారణంగా ఇన్నోవేషన్‌కు హైదరాబాద్ అడ్డాగా మారిందని సామాజిక ఆర్థిక సర్వే-2026 కొనియాడింది.
‘టాస్క్’తో నైపుణ్యాల పెంపు
ఓవైపు టీ-హబ్, మరోవైపు వీ-హబ్‌లతోపాటు ఇంకోవైపు యువతలో నైపుణ్యాలు పెంచడంతో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్)’ను ప్రారంభించింది. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చింది. టాస్క్ ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ప్రస్తుతం జీసీసీల్లో సైతం ఉన్నత ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక టాస్క్ అందిస్తున్న సేవలను సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించింది. ఇండస్ట్రీ రెడీ మానవ వనరులను టాస్క్ ద్వారా అందిస్తున్నట్టు వివరించింది. 2025లో 66,333 మంది టాస్క్ ద్వారా శిక్షణ పొందినట్టు సర్వే వెల్లడించింది. టైర్-2, టైర్-3 సిటీల్లో 2,520 మంది శిక్షణ ఇచ్చినట్టు వివరించింది. తద్వారా 5,637 మందికి ప్లేస్‌మెంట్స్ లభించినట్టు పేర్కొంది. టాస్క్ ద్వారా శిక్షణ పొందిన యువత అత్యధికంగా ఏడాదికి రూ.18 లక్షల వేతనంతో ఉద్యోగం పొందినట్టు వెల్లడించింది. టాస్క్ కేంద్రాల ద్వారా 288 జాబ్ డ్రైవ్‌లు నిర్వహించినట్టు ఆర్థిక సర్వే తెలిపింది.
‘టీ-ఫైబర్’తో రైతాంగానికి సేవలు
బీఆర్ఎస్ హయాంలో 2015లో ప్రవేశపెట్టిన టీ-ఫైబర్ రాష్ట్ర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీకి కీలకమని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొన్నది. రాష్ట్రంలో హై లెవల్ ఇంటర్నేట్ సేవలకు ఇది కీలకమని తెలిపింది. 589 మండలాల్లోని 12,751 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా టీ-ఫైబర్ పనిచేస్తున్నట్టు వివరించింది. టీ-ఫైబర్ వ్యవసాయంతో పాటు విద్యా రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు ప్రశంసించింది. 1,370 రైతు వేదికలకు టీ-ఫైబర్‌ను కనెక్ట్ చేసినట్టు వెల్లడించింది. వ్యవసాయ రంగ నిపుణులతో రైతులకు వీడియోల ద్వారా సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలిపింది. ప్రతి వారం రాష్ట్రంలో 30,000 మంది రైతులు ఈ సేవలు పొందుతున్నట్టు స్పష్టం చేసింది.
సామాజిక ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు
- ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ కేంద్రం టీ-హబ్.
- దేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్.
- స్టార్టప్‌లను ప్రోత్సహించడమే.
- ఏరోస్పేస్, డిఫెన్స్, సస్టెయినబిలిటీ, మొబిలిటీ, హెల్త్‌కేర్, ఏఐ వంటి రంగాల్లో నిర్మాణాత్మక, అధునాతన ఆవిష్కరణలకు టీ-హబ్ మద్దతు.
- టీ-హబ్ అందిస్తున్న సేవలకు 2025లో నిర్వహించిన స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ‘బెస్ట్ కన్సీవ్డ్ కోహర్ట్’ అవార్డు.
- గత పదేండ్లలో రాష్ట్రంలో 10,804 స్టార్టప్‌లు ఏర్పాటైనట్టు డీపీఐఐటీ కేంద్ర గణాంకాల్లో వెల్లడి.
- ఐటీ రంగంలోనేగాక ఔషధ, బయో, మెడికల్, వ్యవసాయ, మహిళా, సామాజిక అంశాల్లో స్టార్టప్‌లకు దన్నుగా ఇంక్యుబేటర్ల ఏర్పాటు.
- మహిళా ఆంత్రప్రెన్యూర్ల ఆర్థిక సాధికారత లక్ష్యంగా వీ-హబ్.
- మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు.
- మహిళలకు నైపుణ్య శిక్షణ, ఇంక్యుబేషన్, మార్కెట్ యాక్సెస్, పాలసీ సపోర్ట్ ఇస్తున్న వీ-హబ్.
- వీ-హబ్ ద్వారా 197 ప్రోగ్రామ్‌లు అమల్లోకి. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఆంత్రప్రెన్యూర్లకు మద్దతు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

