హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా మారిన టీ-హబ్ మరోసారి ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారిని ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో టీ-ఏంజిల్స్ పేరుతో ఐదో విడుత కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నది. జనవరి 5 నుంచి 100 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ఏప్రిల్ 21న ముగియనున్నది.
మార్కెట్లో ప్రభావం చూపే స్టార్టప్‌లను ఎంపిక చేసి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు తనవంతుగా సహాయ సహకారాలు అందించనున్నది. ఇందుకు సంబంధించి అర్హులైన స్టార్టప్ వ్యవస్థాపకులు దరఖాస్తు చేసుకోవాలని నిర్వహకులు సూచించారు. ఎంపికైన స్టార్టప్‌లకు రెండు నెలలపాటు టీ హబ్‌లోని వివిధ రంగాలకు చెందిన నిపుణులచే శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి వాటిని కోరుకుంటున్నారో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.