టోక్యో, జూన్ 5: సుజుకీ మోటర్ జపాన్లో తమ ప్రతిష్ఠాత్మక మాడల్ స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని ఆపేసింది. అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షల నేపథ్యంలోనే సుజుకీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో చైనా చర్యలతో ప్రభావితమైన తొలి జపాన్ ఆటో రంగ సంస్థగా సుజుకీ నిలిచింది. కొన్ని విడిభాగాల కొరతతో గత నెల మే 26 నుంచి స్విఫ్ట్ స్పోర్ట్ వెర్షన్ మినహా మిగతా అన్ని రకాల స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని సుజుకీ మోటర్ నిలిపేసింది. ఉత్పత్తిని తిరిగి ప్రారంభించే పనిలోపడ్డ సుజుకీ.. ఈ నెల 13 నుంచి పాక్షికంగా, 16 నుంచి పూర్తిస్థాయిలో మొదలవుతుందన్న ఆశాభావాన్ని ఓ ప్రకటనలో వ్యక్తం చేసింది. అయితే ఉత్పత్తిని ఆపేయడానికి గల కారణాలను మాత్రం ఈ సందర్భంగా సంస్థ తెలియపర్చలేదు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా తమ దేశం నుంచి జరుగుతున్న అరుదైన ఖనిజాల ఎగుమతుల్ని నిషేధించింది. దీంతో ఆటో రంగ సంస్థలు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్ ఉత్పాదక కంపెనీలు, మిలిటరీ కాంట్రాక్టర్లకు గట్టి దెబ్బ తగిలినైట్టెంది. సెమీకండక్టర్లు, మరికొన్ని ముఖ్యమైన విడిభాగాల తయారీలో ఉపయోగించే అరుదైన ఖనిజాల నిల్వలు చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో ఉన్నప్పటికీ అవి ఆ దేశ మిలిటరీ ఇతర కీలక రంగాల అవసరాలకే వినియోగిస్తున్నారు. దీంతో కార్పొరేట్ల ఒత్తిళ్ల నడుమ అమెరికాతో ఆయా దేశాలు సంప్రదింపులకు దిగుతున్నాయిప్పుడు.
జపాన్లో స్విఫ్ట్ కార్ల ఉత్పత్తిని సుజుకీ మోటర్ ఆపేసినా.. భారత్లో ఆ ప్రభావమేమీ ఉండబోదని దాని అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ చెప్తున్నది. దేశంలో స్విఫ్ట్ కార్ల తయారీ యథాతథంగా జరుగుతూనే ఉందని ఓ మీడియా ప్రశ్నకు మారుతీ సుజుకీ కార్పొరేట్ అఫైర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతీ స్పష్టం చేశారు.