హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా (పీఆర్సీసీఐటీ) సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బత్తి నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ చీఫ్ కమిషనర్‌గా సేవలందిస్తున్న ఆయన.. ప్రస్తుత ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మొరంపూడి అనిల్‌కుమార్ స్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఐటీ శాఖ అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన సురేశ్ బత్తి బీటెక్, ఎంబీఏ విద్యనభ్యసించారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిగా ఆయన విధుల్లో చేరారు. గతంలో గుజరాత్‌లోని సూరత్ ఐటీ విభాగంలో డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ పనితీరును మెరుగుపరచడంలో, పన్ను వసూళ్ల వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో సురేశ్ అనుభవం దోహదపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.