Jet Airways | న్యూఢిల్లీ, నవంబర్ 7: జెట్ ఎయిర్వేస్ దివాలా కథ కీలక మలుపు తిరిగింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ ఎయిర్‌లైన్ ఆస్తుల్ని అమ్మేయాలంటూ గురువారం సుప్రీం కోర్టు ఆదేశించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభిస్తున్న విశేషాధికారాలను ఉపయోగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. ఫలితంగా ఈ కేసులో నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆదేశాలను పక్కనపెడుతూ జెట్ ఎయిర్వేస్ దివాలా ప్రక్రియకు సుప్రీం ముగింపు పలికినైట్టెంది. ఇక ఈ వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ అధినేత నరేష్ గోయల్ జైలుపాలైన విషయం తెలిసిందే.
ఒకప్పుడు దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థగా వెలుగొందిన జెట్ ఎయిర్వేస్ను 2010 చివరి నుంచి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. మితిమీరిన రుణ భారం (రూ.7,500 కోట్లు), పెరిగిన నిర్వహణ వ్యయం, ప్రత్యర్థి సంస్థల నుంచి పోటీ తీవ్రతరం నేపథ్యంలో జెట్ విమానయాన కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌లో నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేక, తెచ్చిన అప్పుల్ని తిరిగి చెల్లించలేక యాజమాన్యం చేతులెత్తేసింది.
ఈ క్రమంలోనే బకాయిల వసూళ్లలో భాగంగా ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతలు దివాలా ప్రక్రియ కోసం ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. దీంతో జెట్‌ను టేకోవర్ చేసేందుకు బ్రిటన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్, యూఏఈకి చెందిన మురారీ లాల్ జలాన్ కన్సార్టియం ముందుకొచ్చింది. ఈ కన్సార్టియం ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికకు 2021లో ఎన్సీఎల్టీ ఆమోదం లభించింది. దీని ప్రకారం తొలుత రూ.350 కోట్లు, ఆ తర్వాత రూ.4,783 కోట్లను కన్సార్టియం చెల్లించాలి.
అయితే కన్సార్టియం విఫలమైంది. తదనంతరం ఈ వ్యవహారం ఎన్సీఎల్ఏటీలోకి వెళ్లగా, అక్కడ ఎలాంటి చెల్లింపులు చేయకుండానే జలాన్-కల్రాన్ కన్సార్టియంకు జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కుల బదిలీకి వీలు కల్పిస్తూ ఆదేశాలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రుణదాతలు సుప్రీం కోర్టు గడప తొక్కాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను తోసిపుచ్చుతూ పైవిధంగా తీర్పునిచ్చింది. ఇక జెట్‌ను దక్కించుకునే ప్రక్రియలో భాగంగా కన్సార్టియం చెల్లించిన రూ.200 కోట్లనూ జప్తు చేయాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. ఇందులో బ్యాంకులు రూ.150 కోట్లను పర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీగా అందుకోవచ్చని కూడా చెప్పింది.