ఖమ్మం, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులు పండించిన వాణిజ్య పంటలను ప్రోత్సహించి, వారికి స్థిర ఆదాయం అందించాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. రాష్ట్రంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న పామాయిల్ సాగుకు అనుగుణంగా ఓ సమీకృత ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించి రైతులకు చేయూతనివ్వాలని, అలాగే స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద పామాయిల్ ఉత్పత్తి కర్మాగారం నిర్మించాలని సంకల్పించింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి గోద్రేజ్ సంస్థ ముందుకు రావడంతో 2023 మార్చిలో అప్పటి మున్సిపల్, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్, నాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. అలా పూర్తయిన ఈ ఫ్యాక్టరీని సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి , వ్యవసాయ మంత్రి తుమ్మల ప్రారంభించారు.
113 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కర్మాగారంలో దేశంలోనే తొలిసారిగా పామాయిల్ విత్తన ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. రూ.300 కోట్లతో నిర్మించిన ఈ కార్మాగారం ద్వారా పామాయిల్ పండించే రైతులకు పూర్తి సహాయ సహకారాలు, సలహాలు కూడా అందనున్నాయి. రైతులను పామాయిల్ పంట వైపు నడిపించేందుకు, నాణ్యమైన పామాయిల్ మొక్కలను అందించి, అవి గెలలు వేసేదాకా అవసరమైన సలహాలనూ సంస్థ యాజమాన్యం ఇవ్వనున్నది. ఇక రైతులు శ్రమకోర్చి పండించిన గెలలను స్థానికంగానే ప్రాసెస్ చేసే సౌకర్యం ఈ కార్మాగారంతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలం అప్పారావుపేట, అశ్వారావుపేట మండల కేంద్రంలో రెండు సర్కారీ కర్మాగారాలున్నాయి.
ఈ మూడో కర్మాగారంలో పామాయిల్ ఉత్పత్తి, విత్తన ఉత్పత్తి రెండూ ఒకేచోట జరుగనుండటం ప్రత్యేకత. ఇక ఈ కర్మాగారం నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ఆయిల్‌పామ్ రైతులకు గెలల రవాణా సులభమైయిందనే చెప్పవచ్చు. ఈ ఫ్యాక్టరీతో 700 మందికి ప్రత్యక్షంగా, మరో 600 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ కార్యక్రమంలో గోద్రేజ్ కంపెనీ చైర్పర్సన్ నదీర్బీ గోద్రేజ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కటారియా, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.