న్యూఢిల్లీ : భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారీ వేతనాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. ఐటీ దిగ్గజ కంపెనీల్లో అయితే టెకీల ప్యాకేజ్‌లు ఊహించనంత ఉంటాయని లెక్కలేస్తుంటారు. అయితే కంపెనీలకు ఇంజనీర్లను హైర్ చేసుకోవడంలో సహకరించే స్టార్టప్ వీక్డే సర్వేలో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌తో పోలిస్తే ఉత్పత్తి రంగంలోని స్టార్టప్‌ల్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారీ వేతనాలున్నాయని వెల్లడైంది. 50,000 మందికి పైగా ఇంజనీర్ల వేతనాల గణాంకాలను విశ్లేషించిన అనంతరం వీక్డే ఈ వివరాలను తెలిపింది. షేర్‌చాట్, క్రెడ్, మీషో, స్విగ్గీ వంటి స్టార్టప్‌ల్లో పనిచేసే ఇంజనీర్ల వేతనాలు విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దేశీ ఐటి దిగ్గజ కంపెనీల టెకీల కంటే అధికమని ఈ డేటా తెలిపింది.
షేర్‌చాట్ తన మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అత్యధిక వేతన ప్యాకేజ్ ఆఫర్ చేస్తోందని సర్వే వెల్లడించింది. నాలుగేండ్ల అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఈ సోషల్ మీడియా సంస్ధ ఏకంగా రూ 47 లక్షల వార్షిక వేతనం అందిస్తోంది. క్రెడ్, మీషోలు రూ 40 లక్షలు, రూ 39 లక్షల వార్షిక ప్యాకేజ్‌తో ఈ జాబితాలో తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. సర్వీసుల ఆధారిత ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి వాటితో పోలిస్తే ఈ వేతనాలు చాలా అధికం. ఈ కంపెనీలు నాలుగేండ్ల అనుభవం కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కేవలం దాదాపు రూ 10 లక్షల వార్షిక వేతనం మాత్రమే చెల్లిస్తున్నాయి. స్టార్టప్‌లు ఆఫర్ చేస్తున్న ప్రారంభ వేతనం కంటే చాలా తక్కువగా ఈ భారీ ఐటీ కంపెనీలు కేవలం రూ 7 లక్షల వార్షిక ప్యాకేజ్‌నే ప్రారంభ వేతన ప్యాకేజ్‌గా అందిస్తున్నాయని వెల్లడైంది.
ఇక షాప్‌క్లూస్ నాలుగేండ్ల అనుభవం ఉన్న టెకీలకు రూ 12 లక్షల వార్షిక వేతనం చెల్లిస్తుండగా జొమాటో, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు అదే ఎక్స్పీరియన్స్ ఉన్న టెకీలకు వరుసగా రూ 32 లక్షలు, రూ 22 లక్షలు, రూ 36 లక్షలు చెల్లిస్తున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీల కంటే ఈ యూనికార్న్‌లు అధిక వేతనం చెల్లిస్తున్నాయి. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 50 శాతం, 70 శాతం వేతన పెంపును ఆశిస్తూ తరచూ ఉద్యోగాలు మారుతున్నారని ఒకే కంపెనీలో ఉంటే ఏటా పది శాతం మించి వేతన పెంపు ఉండబోదని వారు భావించడం వల్లే టెకీలు తరచూ జాబ్‌లు మారుతుంటారని ఈ సర్వే పేర్కొంది.