హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల్లో ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు సరికొత్త ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించేలా ప్రోత్సహించేందుకు వీ హబ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. వీ ఆల్ఫా పేరుతో మొదటి విడతగా నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 12 విద్యార్థినిల బృందాన్ని ఎంపిక చేశారు. వ్యవసాయం, సుస్థిర, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమేషన్, డీప్‌టెక్ వంటి అంశాల్లో విద్యార్థినిల ఆలోచనలకు అనుగుణంగా స్టార్టప్‌లను ప్రారంభించి కార్యకలాపాలను నిర్వహించేందుకు ఎంపిక చేసి, వారికి సర్టిఫికెట్లతోపాటు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)లో వీరిని రిజిస్ట్రేషన్ చేయించి స్టార్టప్‌లుగా గుర్తించనున్నామని వీ హబ్ సీఈవో దీప్తి రావుల తెలిపారు. గత 4 ఏళ్లుగా వీ హబ్ మహిళలను వ్యాపార వేత్తలుగా ప్రోత్సహించడంతో పాటు విద్యార్థినిలు సైతం మంచి ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తున్నామని ఆమె చెప్పారు. వీ ఆల్ఫా కార్యక్రమంలో 12 బృందాలను ఎంపిక చేశామని, తరువాతి దశలో వారికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను తాము అందిస్తామన్నారు.
రెండో దశకు దరఖాస్తుల ఆహ్వానం..
వీ హబ్‌లో రెండో దశ వీ ఆల్ఫా కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని దీప్తి రావుల తెలిపారు. వచ్చే నెల15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, కళాశాల విద్యార్థినిలు ఇందులో పాల్గొనవచ్చని ఆమె సూచించారు.