Adani Group | అదానీ పోర్ట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నది. దేశంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని పోర్టులకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశాల నుంచి సరుకుల రవాణాపై నిషేధం విధించింది. ఈ దేశాల సరుకుల రవాణాలో పాల్గొనబోమని వెల్లడించింది. ఈ నిర్ణయం వచ్చేనెల 15 నుంచి అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా 13 నౌకాశ్రయాలను అదానీ పోర్ట్స్ నిర్వహిస్తున్నది. దేశీయంగా కార్గో రవాణాలో అదానీ గ్రూప్‌కు 25 శాతం ఉంది.
గుజరాత్‌లోని అదానీ పోర్ట్స్ నిర్వహిస్తున్న ముంద్రా పోర్ట్‌లో గత నెలలో మూడు వేల కిలోల హెరాయిన్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీని విలువ రూ.21 వేల కోట్లు ఉంటుందని అంచనా. దీంతో అదానీ గ్రూప్‌తోపాటు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సమస్యగా మార్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశాల నుంచి సరుకుల రవాణాపై నిషేధం విధిస్తున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎగ్జిమ్ కంటైనర్‌ను అదానీ పోర్ట్ సెజ్‌లో హ్యాండిల్ చేయలేదని వెల్లడించింది.
ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఆదివారం పలుచోట్ల ఎన్ఐఏ తనిఖీలు జరిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తులో పాల్పంచుకుంటున్నది. చెన్నై, కోయంబత్తూర్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు.