Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ట్రేడింగ్ జరిగినంత సేపు స్టాక్స్ నష్టాల్లోనే సాగాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు అదానీ గ్రూప్ సంస్థలపై మోర్గాన్ స్టాన్లీ సంస్థ వెయిటేజీ తగ్గింపు, విదేశీ ఇన్వెస్టర్ల సేల్స్, ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం నుంచి ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా పూర్తిగా వాటాల విక్రయించడంతో ట్రేడింగ్ అసాంతం స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఉదయం 60,706.81 పాయింట్ల వద్ద బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ నష్టాలతోనే మొదలైంది. అంతర్గత ట్రేడింగ్‌లో 60,774.14 పాయింట్ల గరిష్టానికి.. తిరిగి 60,501.74 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 123.5 పాయింట్ల నష్టంతో 60,682.70 పాయింట్ల వద్ద నిలిచింది.
ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు సిద్ధం కావడంతో హెచ్‌సీఎల్ టెక్ 2.7 శాతం నష్టంతో ముగిసింది. ఇంకా టాటా స్టీల్, రిలయన్స్, విప్రో, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) స్టాక్స్ నష్టాలతో సరి పెట్టుకున్నాయి. సెన్సెక్స్‌లో 13 సూచీలే లాభాలు గడించాయి. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఆల్ట్రా టెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, టైటాన్, మారుతి సుజుకి లాభాలతో ముగిశాయి.
మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 ట్రేడింగ్ శుక్రవారం ఉదయం 17,847.55 పాయింట్ల వద్ద మొదలై.. 17,876.95 పాయింట్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లి, తిరిగి 17,801 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 37 పాయింట్ల పతనంతో 17,856.50 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇక ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ 82.58 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.48 శాతం లాభ పడితే, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. గౌతం అదానీ గ్రూప్ కంపెనీలపై ఒత్తిడి కొనసాగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్ స్టాక్స్ శుక్రవారం ఇంట్రా డే ట్రేడింగ్‌లో 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి.
ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీలో ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.640 పాయింట్లకు పడిపోయింది. చివరకు ట్రేడింగ్ ముగింపు దశలో 7.82 శాతం నష్టంతో రూ.650.75 వద్ద నిలిచింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండు శాతం నష్టపోతే, నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 1.36 శాతం లాభంతో ముగిసింది.