Stock Markets | ముంబై, జూలై 28: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల కారణంగా స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 66,350-65,860 పాయింట్ల మధ్య దాదాపు 600 పాయింట్ల మధ్య ఊగిసలాడి, చివరకు 107 పాయింట్ల నష్టంతో 66,160 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేరీతిలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,695 గరిష్ఠస్థాయి నుంచి ఇంట్రాడేలో 19,563 పాయింట్లకు పతనమైంది. చివరిగంటలో షార్ట్ కవరింగ్ ఫలితంగా కొంతవరకూ కోలుకున్నప్పటికీ, చివరకు 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 19,646 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్‌లో క్యూ2 జీడీపీ అంచనాల్ని మించి వృద్ధిచెందడంతో ఫెడ్ మరోదఫా వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాలతో గత రాత్రి అమెరికా మార్కెట్ క్షీణించింది. ఈ కారణంగా దేశీయ ఈక్విటీల్లో కూడా అమ్మకాలు జరిగాయని, కొద్దిరోజులుగా కొంటున్న విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా అమ్మకాలు జరపడం సైతం మార్కెట్ ఒడిదుడుకులకు లోనుచేసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
సెన్సెక్స్-30 షేర్లలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహింద్రా, మారుతీ షేర్లు 1-3 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీలు 1-4 శాతం మధ్య లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ పవర్ ఇండెక్స్ 2.57 శాతం పెరిగింది. రియల్టీ సూచీ 1.92 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.01 శాతం, ఎఫ్ఎంసీజీ 0.85 శాతం, కమోడిటీస్ సూచీ 0.56 శాతం చొప్పున పెరిగాయి. టెక్నాలజీ, ఐటీ, ఆటోమొబైల్ సూచీలు 0.69 శాతంవరకూ నష్టాల్ని చవిచూశాయి. తాజాగా చిన్న షేర్లు సైతం ర్యాలీ జరపడం గమనార్హం.