ముంబై, మే 29: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుపై అక్కడి కోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఇదే క్రమంలో దేశీయ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి.
తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరి అరగంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో భారీగా లాభపడ్డాయి. ఒక దశలో 500 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 320.70 పాయింట్లు అందుకొని 81,633.02 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 81.15 పాయింట్లు అందుకొని 24,833.60 వద్ద స్థిరపడింది.