ముంబై, ఆగస్టు 25 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఐటీ, వాహన రంగ షేర్లలో ర్యాలీకి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల స్పందన మరింత ముందుకు నడిపించాయి. వచ్చే సమీక్షలోనే వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వు చీఫ్ వ్యాఖ్యలు సూచీలకు ఆక్సిజన్‌లా పనిచేశాయి. ఒక దశలో 500 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 329.06 పాయింట్లు అందుకొని 81,635.91 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 97.65 పాయింట్లు అందుకొని 24,967.75 వద్ద ముగిసింది. వచ్చే నెల సమీక్షలోనే యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
ఐటీ రంగ షేర్లు కదంతొక్కాయి. దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ షేరు 3.03 శాతం లాభపడి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టీసీఎస్ 2.85 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీ 2.6 శాతం, టెక్ మహీంద్రా 1.32 శాతం చొప్పున అధికమయ్యాయి. టాటా మోటర్స్, టైటాన్, సన్‌ఫార్మా, మారుతి, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, రిలయన్స్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, ట్రెంట్, ఎటర్నల్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ బీఈఎల్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రాఅండ్‌మహీంద్రా, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, అదానీపోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ రంగ సూచీ అత్యధికంగా 2.35 శాతం లాభపడగా, టెక్నాలజీ 1.67 శాతం, వాహన, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, క్యాపిటల్ గూడ్స్, టెలికం, ఇండస్ట్రీయల్స్, ఆర్థిక సేవల రంగ షేర్లు నష్టపోయాయినష్టపోయాయి.