ముంబై, జూలై 4: తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో లాభాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్ రంగ సూచీలకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అమెరికా సూచీల ర్యాలీ కూడా దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసేసరికి 193.42 పాయింట్లు అందుకొని 83,432.89 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 55.70 పాయింట్లు అందుకొని 25,461 పాయింట్లకు చేరుకున్నది. అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందం తుది గడువు దగ్గర పడుతుండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
షేర్లలో బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ట్రెంట్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతి షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు 1.26 శాతం లాభపడగా, ఎనర్జీ, రియల్టీ, ఐటీ, హెల్త్‌కేర్, ఐటీ, టెక్నాలజీ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. మెటల్, టెలికం, వాహన, కన్జ్యూమర్ డ్యూరబుల్, కమోడిటీస్ రంగ షేర్లు పతనం చెందాయి.