Stock Market : భారత్ స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,000 పాయింట్లకుపైగా నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 371 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే దాదాపు రూ.11 లక్షల కోట్ల వరకు పోగొట్టుకున్నారు. ఆర్బీఐ రెపో రేట్ పెంపు, రూపాయి బలహీన పడటం, క్రూడాయిల్ ధర పెరగడం వంటివన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి.
ట్రేడింగ్ ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 72,668.00 పాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ప్రారంభమైంది. తర్వాత 71,327.75 పాయింట్ల కనిష్టాన్ని తాకింది. చివరకు 1,045.46 పాయింట్ల నష్టంతో 71,593.24 వద్ద ముగిసింది. 1.44 శాతం నష్టపోయింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 371.25 పాయింట్ల (1.64 శాతం) నష్టంతో 22,231.80 వద్ద ముగిసింది. ఈ భారీ నష్టం కారణంగా బీఎస్ఈలో నమోదైన కంపెనీలు రూ.11.37 లక్షల కోట్లు కోల్పోయాయి. ఇంతకుముందు రోజు మొత్తం మార్కెట్ విలువ రూ.4,72,35,273.39 కోట్లుగా ఉండగా, ఈ రోజు అది రూ.4,60,97,838.63 కోట్లకు తగ్గింది.
మరోవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 4.25 శాతం పెరిగి, 104.46 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారక విలువ 96.78కి చేరింది. గత మే నెలలో అత్యంత కనిష్ట స్థాయి 96.69. గురువారం దీనికి దగ్గరగా రూపాయి విలువ పడిపోయింది. మరోవైపు యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల పెంపును కేంద్రం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ నెలలో అమలు కావాల్సిన ఛార్జీలు వచ్చే జనవరి వరకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.