Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో చివరి రోజు శుక్రవారం కూడా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ దాదాపు ఒక్కశాతం నష్టపోయాయి. దాదాపు అన్ని సెక్టార్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 808.65 పాయింట్లు పతనమై (0.98 శాతం) నష్టంతో 81,688.45 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డే ట్రేడింగ్లో 81,532.68 పాయింట్ల కనిష్టం నుంచి 83,368.32 పాయింట్ల గరిష్టం మధ్య తచ్చాడింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 235.50 పాయింట్లు (0.93 శాతం) పతనంతో 25,014.60 పాయింట్ల వద్ద స్థిర పడింది. అంతర్గత ట్రేడింగ్ లో 24,966.80 పాయింట్ల కనిష్టం నుంచి 25,485.05 పాయింట్ల గరిష్టం మధ్య తచ్చాడింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ ను బలహీన పరిచాయి.
ఉదయం నష్టాలతో మొదలైనా, మధ్యాహ్నానికి కొనుగోళ్ల మద్దతు లభించింది. కానీ మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఇండెక్సులు నష్టాలతో ముగిశాయి.ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా, రియాల్టీ, ఓఎంసీ సెక్టర్లు ఒక శాతానికి ఫైనాగా నష్టపోయాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2.53 శాతం లాభ పడింది. ఐటీ ఇండెక్స్ 0.45 శాతం, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ 0.61 శాతం లాభాలతో ముగిశాయి. రిలయన్స్ తోపాటు బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురి కాగా, ఐటీ స్టాక్స్ పుంజుకున్నాయి.
ఎన్ఎస్ఈ-50 నిఫ్టీలోని 50 స్టాక్స్ కు 37 నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, బీపీసీఎల్, హీరో మోటో కార్ప్ స్టాక్స్ 3.54 శాతం వరకూ పతనం అయ్యాయి. ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా మోటార్స్, విప్రోతోపాటు 13 స్టాక్స్ 1.51 శాతం వరకూ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ నష్టపోగా ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ స్టాక్స్ లాభాలతో ముగిశాయి.