Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఇండెక్స్ హెవీ వెయిట్స్‌గా పేరొందిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్ వంటి స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 733 పాయింట్ల నష్టంతో 73,878 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 173 పాయింట్ల పతనంతో 22,476 పాయింట్ల వద్ద స్థిర పడింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో ప్రారంభమైనా.. హెవీ వెయిట్ స్టాక్స్ – రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ అండ్ టీ, మారుతి తదితర స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రా డే ట్రేడింగ్‌లో 1143 పాయింట్లు కోల్పోయి 73,468 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22350 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ-30లో 24, ఎన్ఎస్ఈ-50 స్టాక్స్ లో 35 స్టాక్స్ నెగెటివ్ జోన్ లోనే కొనసాగాయి. లార్సన్ అండ్ టర్బో (ఎల్ అండ్ టీ), మారుతి సుజుకి, రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్ టెల్ భారీగా నష్టపోయాయి. స్టాక్స్ 1.7-2.7 శాతం మధ్య పతనం అయ్యాయి. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఒకశాతం, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో, పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్సులు 0.7 శాతం చొప్పున నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభాల్లో ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సంస్థల చివరి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల సీజన్, యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయం వాయిదా వంటి అంశాలు మార్కెట్ల పతనానికి కారణంగా కనిపిస్తున్నది.