Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బ్లూ చిప్ స్టాక్స్, ఆసియా మార్కెట్లలో ప్రతికూల పవనాల నేపథ్యంలో నష్టాల్లో మొదలయ్యాయి. 30 షేర్ల బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ ప్రారంభ ట్రేడింగ్‌లో 106.78 పాయింట్లు పతనమై.. 81,223.78 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 38.45 పాయింట్లు తగ్గి.. 24,628.45 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెస్సెక్స్ 280.95 పాయింట్లు తగ్గి.. 81,049.61 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 58.85 పాయింట్ల తగ్గి 24,608.05 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది.
సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు నష్టాలను చవిచూశాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లాభాలను నమోదు చేశాయి. ఇదిలా ఉండగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) బుధవారం రూ.931.80 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ నష్టాలతో ట్రేడవుతున్నాయి.