Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. అన్ని సెక్టార్ల పరిధిలో ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడంతో ఇటు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒకశాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1272.07 పాయింట్ల (1.40 శాతం) నష్టంతో 84,299.78 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 368.10 పాయింట్ల (1.41 శాతం) పతనంతో 25,810.85 పాయింట్ల వద్ద స్థిర పడింది.
నిఫ్టీ-50లో 41 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. హీరో మోటో కార్ప్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర స్టాక్స్ 4.03 శాతం నష్టపోయాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్ తదితర తొమ్మిది స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. అలాగే బీఎస్ఈ-30లో 25 స్టాక్స్ నష్టాలతో స్థిర పడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాక్స్ 3.15 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్ మాత్రమే లాభ పడ్డాయి.