Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలను మూటగట్టుకున్నాయి. బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలతో ఈక్విటీ మార్కెట్లు బుధవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు. చివరి సెషన్లో మార్కెట్లు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 80,237.85 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,435.61 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 79,821.99 పాయింట్లకు పతనమైంది. చివరకు 426.85 పాయింట్లు పతనమై.. 79,942.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 126 పాయింట్లు పతనమై.. 24,340.80 వద్ద ముగిసింది. దాదాపు 2,787 షేర్లు లాభాల్లో కొనసాగగా.. 978 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ట్రెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టాప్ లూజర్‌గా నిలిచాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా కన్స్యూమర్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ లాభపడ్డాయి. సెక్టోరల్‌లో ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మీడియా 0.5 నుంచి 2శాతం పెరిగాయి. బ్యాంక్, ఫార్మా, ఐటీ ఒకశాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదిలా ఉండగా.. దీపావళి రోజున ఎన్ఈసీ, బీఎస్ఈలతో పాటు కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఎంసీఎక్స్‌లో నవంబర్ ఒకటో తేదీన ముహరత్ ట్రేడింగ్ జరుగనున్నది. ముహురత్ ట్రేడింగ్ అనేది భారతీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దాదాపు గంట పాటు స్పెషల్ ట్రేడింగ్ కొనసాగుతున్నది. శుభ సమయంలో జరిగే ఈ ప్రత్యేక సెషన్లో పెట్టుబడిదారులు, వ్యాపారులు కొనుగోళ్లు చేస్తుంటారు. ఈ సమయంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో స్టాక్స్, కమోడిటీలను కొనుగోలు చేస్తుంటారు.