SBI | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్-బేస్డ్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో గృహ, వ్యక్తిగత రుణాలతోపాటు ఇతర రుణాలపై చెల్లించే ఈఎంఐలు తగ్గనున్నాయి. ఈ నూతన రేట్లు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి. రిజర్వుబ్యాంక్ ఇటీవల రెపోరేటును 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.
దీంతో ఈబీఎల్ఆర్ రేటు పావు శాతం తగ్గించడంతో రేటు 9.15 శాతం నుంచి 8.90 శాతానికి దిగొచ్చింది. అలాగే ఆర్ఎల్ఎల్ఆర్ కూడా 8.50 శాతానికి దించింది. ఆర్బీఐ విధించిన రెపోరేటు ఆధారంగా బ్యాంకులు దీనికి అనుగుణంగా రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తుంటాయి. సెంట్రల్ బ్యాంక్ గతవారంలో రెపోరేటును తగ్గించడంతో బ్యాంకులు ఒక్కోక్కటి రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. ఎస్బీఐ కూడా ఈ నిర్ణయం తీసుకున్నది. కానీ, మార్జినల్ కాస్ట్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్), బేస్రేటు, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ని యథాతథంగా ఉంచింది బ్యాంక్.
తెలంగాణకు చెందిన రిఫైనరీ కంపెనీ శీతల్ రిఫైనరీస్ లిమిటెడ్, మరికొన్ని సంస్థల రుణ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.30 కోట్లకుపైగా విలువైన ఆస్తులను రికవరీ చేసి ఎస్బీఐకి అప్పగించింది.
ఎస్బీఐ బాటలోనే మరిన్ని బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. వీటిలో కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు ఉన్నాయి. దీంట్లో కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 9.25 శాతం నుంచి 9 శాతానికి దించింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా బీఆర్ఎల్ఎల్ఆర్ వడ్డీరేటును 8.90 శాతానికి దించింది.
ఈ వడ్డీరేట్లు ఈ నెల 10 నుంచే అమలులోకి వచ్చాయి. అలాగే ఈ నెల 7 నుంచి అమలులోకి వచ్చేలా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎల్ఎల్ఆర్ రేటుని 9.35 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా 9.10 శాతానికి తగ్గించగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా రెపోతో అనుసంధానమై రుణాలపై వడ్డీరేటును 9.25 శాతం 9 శాతానికి తగ్గించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం ఆర్ఎల్ఎల్ఆర్ వడ్డీరేటును 9 శాతానికి కోత పెట్టింది.