Startups Layoffs | ఆర్థిక మాంద్యం ప్రభావంతో కార్పొరేట్ సంస్థలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఆ బాటలోనే స్టార్టప్ సంస్థలు పయనిస్తున్నాయి. 2024 తొలి ఆరు నెలల్లో స్టార్టప్ సంస్థలు దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీలు సైతం ఉద్యోగుల నియామకాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. అయితే, 2023తో పోలిస్తే ఈ ఏడాది కాసింత ఊరట అనే చెప్పాలి. గతేడాది తొలి (జనవరి-జూన్) ఆరు నెలల్లో సుమారు 21 వేల మంది ఉద్యోగులు ఇంటికి పరిమితమైతే, ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య 10 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
2023 (జనవరి -జూన్) లో 21 వేల మంది ఉద్యోగులను వివిధ స్టార్టప్ సంస్థలు ఇండ్లకు సాగనంపాయని లాంగ్ హౌస్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక తెలిపింది. స్విగ్గీ, ఓలా, కల్ట్ ఫిట్, లిసియస్, ప్రిస్టియన్ కేర్, బైజూ వంటి వెంచర్ ఫండింగ్ సంస్థలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని సీనియర్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థం (జూలై-డిసెంబర్) లో 5,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. తొలగించిన ఉద్యోగుల్లో 15-20 శాతం ఉద్యోగాలను మాత్రమే స్టార్టప్ సంస్థలు భర్తీ చేస్తున్నాయి.
ఫ్లిప్ కార్ట్, పేటీఎం వంటి అతిపెద్ద కన్జూమర్ ఇంటర్నెట్ సంస్థలు సైతం ఉద్యోగులను కుదిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫ్లిప్ కార్ట్ తన సిబ్బందిని 5-7 శాతం అంటే 1100-1500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం నిరంతరం ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటి వరకూ వెయ్యి మందిని ఇండ్లకు సాగనంపింది. స్విగ్గీ కనీసం 400 మందిని తొలగిస్తే, త్వరలో ఐపీఓకు వెళ్లనున్న ఓలా ఎలక్ట్రిక్ 600 మందిని సాగనంపేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఓలా అనుబంధ ఓలా క్యాబ్స్ గత ఏప్రిల్ లో సుమారు 200 మందిని తొలగించింది. దేశవ్యా్ప్తంగా స్టార్టప్ సంస్థల్లో ఉద్యోగుల ఉద్వాసనలు 7-15 శాతం మధ్య ఉంటున్నాయి. వాటిల్లో 20 శాతం లేఆఫ్స్ ‘సైలెంట్ లేఆఫ్స్’ అని లాంగ్ హౌస్ కన్సల్టింగ్ కో ఫౌండర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్షుమన్ దాస్ చెప్పారు.