Startup India | ముంబై, జూన్ 27: ‘స్టార్టప్ ఇండియా’కు కష్టాలు వచ్చిపడ్డాయి. వైవిధ్యమైన ఆలోచనలకు ప్రోత్సాహం కరువైంది. సొంతంగా తాము ఎదిగి, మరో పది మందికీ ఉపాధి కల్పించాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత స్థాయిలో చేయూత లభించడం లేదు మరి. ఈ ఏడాది యునికార్న్లుగా ఎదిగిన స్టార్టప్‌ల సంఖ్యను చూస్తే ఇదే అవగతమవుతున్నది. మంగళవారం ‘ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియన్ ఫ్యూచర్ యునికార్న్ ఇండెక్స్ 2023’ జాబితా విడుదలైంది. దీని ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 1 బిలియన్ డాలర్లకుపైగా విలువతో యునికార్న్ హోదాను దక్కించుకున్న భారతీయ స్టార్టప్‌లు కేవలం మూడే. నిరుడు ఈ సంఖ్య 24గా ఉండటం గమనార్హం. దీంతో భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో మందగమనం సంకేతాలు కనిపిస్తున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్, హురున్ ఇండియా వ్యా ఖ్యానించింది. భవిష్యత్తులో యునికార్న్లుగా ఎదిగే స్టార్టప్‌లతో ఈ జాబితా తయారైంది.
నిధుల వేటలో స్టార్టప్‌లు
ప్రస్తుతం దేశంలోని చాలా స్టార్టప్‌ల పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ఓవైపు దేశ, విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు పడిపోగా.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచీ అండదండలు లేకుండాపోయాయి. ఫలితంగా ఎక్కడివక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే దేశంలో యునికార్న్‌లు 84 నుంచి 83కు క్షీణించడం భారతీయ స్టార్టప్‌ల రంగంలో నెలకొన్న సంక్షోభపు పరిస్థితులకు అద్దం పడుతున్నది. కాగా, నిలకడలేని వ్యాపార విధానాలను స్టార్టప్‌లు అనుసరిస్తుండటం కూడా కష్టాలను పెంచుతున్నాయని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో, ఎండీ రాజేశ్ సలుజా అన్నారు. అయితే పరిస్థితులు మెరుగుపడితే, ప్రభుత్వాలు దన్నుగా ఉంటే వచ్చే ఐదేండ్లలో 200 యునికార్న్లున్న దేశంగా భారత్ నిలుస్తుందన్న ఆశాభావాన్ని హురున్ ఇండియా చీఫ్ రిసెర్చర్ అనాస్ రెహమాన్ వ్యక్తం చేశారు.