న్యూఢిల్లీ: యాపిల్ సంస్థ ప్రతి ఏడాది ఐఫోన్ మోడళ్లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది ఐఫోన్ 18 (iPhone 18)మోడల్‌ను రిలీజ్ చేయడం లేదని తెలిసింది. ఐఫోన్ 18 బేసిక్ వర్షన్ ఐఫోన్‌ను 2027లో రిలీజ్ చేయనున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 బేసిక్ మోడల్ రిలీజ్ కావడం లేదని యాపిల్ కంపెనీ తన భాగస్వామ్య కంపెనీలకు చెప్పింది. వచ్చే ఏడాది హయ్యర్ ఎండ్ మోడల్స్‌ను ఆవిష్కరించనున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. స్టాండర్డ్ ఐఫోన్ 18, ఎంట్రీ లెవల్ ఐఫోన్ 18ఈ మోడల్స్ మాత్రం 2027 తొలి అర్థభాగంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 2026లో ఫోల్డబుల్ ఐఫోన్‌ను యాపిల్ కంపెనీ లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. దీనితో పాటు ఐఫోన్ 18 ఎయిర్, ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రోమ్యాక్స్ రిలీజ్ అవుతాయి. కేవలం ప్రీమియం మోడళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే బేస్, ఎంట్రీ లెవల్ వర్షన్స్ మాత్రం మరో ఆరు నెలల తర్వాత రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్, ఐఫోన్ 18 ప్రో మోడల్స్ వచ్చే ఏడాది రెండో భాగంలో రిలీజ్ కానున్నట్లు టెక్ విశ్లేషకుడు మింగ్ చి కూవో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక స్టాండర్డ్ ఐఫోన్ 18, ఐఫోన్ 18ఈ మోడళ్లు మాత్రం 2027లో రిలీజ్ అవుతాయన్నారు.