న్యూఢిల్లీ, జూన్ 14: పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న ఐటీసీ.. 24 మంత్రా ఆర్గానిక్ బ్రాండ్‌కు చెందిన శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్ను హస్తగతం చేసుకున్నది. పూర్తిగా నగదు రూపంలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.472.50 కోట్లుగా నిర్ణయించింది. అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం ఐటీసీకి దన్నుగా నిలువనున్నది. ఎస్ఎన్బీపీఎల్లో 100 శాతం వాటాను శుక్రవారం కొనుగోలు చేసినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది.
భారత్‌తోపాటు విదేశాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రెండు నెలల క్రితమే శ్రేష్టలో మెజార్టీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీసీ ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఈ వాటాను 100 శాతానికి పెంచుకున్నది. ప్రస్తుతం ఎస్ఎన్బీపీఎల్..100 రకాల ఆర్గానిక్ ఉత్పత్తులు, బ్రాండెడ్ కిరాణా సామాగ్రి, సుగంధ ద్రవ్యాలు, మసాల దినుసులు, వంటనూనెలు, పానీయాలు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను శ్రేష్ట రూ.306.1 కోట్ల ఆదాయాన్ని గడించింది. 27 వేల మంది రైతులు, 1.4 లక్షల ఎకరాల సర్టిఫైడ్ ఆర్గానిక్ భూమి, 10 రాష్ర్టాల్లో 71 క్లస్టర్లను కలిగివున్నది సంస్థ.