న్యూఢిల్లీ, జూలై 27: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాకిచ్చింది. సంస్థకున్న విమాన సర్వీసుల్ని సగానికి కుదిస్తూ ఆంక్షల్ని విధించింది. వచ్చే 8 వారాలు స్పైస్జెట్కున్న మొత్తం విమానాల్లో 50 శాతం విమానాల్నే నడుపాలని బుధవారం ఆదేశించింది. ఇటీవల స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ తాజా నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ 8 వారాలు పెంచిన నిఘాకు లోబడి స్పైస్‌జెట్ నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రభావమేమీ ఉండదు: స్పైస్‌జెట్
ప్రయాణాలు అంతంతమాత్రంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో చాలా ఎయిర్‌లైన్స్ తమ విమానాలను రీషెడ్యూల్ చేస్తున్నాయని, కాబట్టి డీజీసీఏ తీసుకున్న ఈ నిర్ణయం తమపై ఎటువంటి ప్రభావం చూపబోదని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. ఈ క్రమంలోనే స్పైస్‌జెట్ విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాబోయే రోజులు, వారాల్లో షెడ్యూల్ ప్రకారమే అన్ని విమానాలు నడుస్తాయని స్పష్టం చేశారు. ఏ విమానం రద్దు కాదని కూడా చెప్పారు. జూన్ 19 నుంచి ఈ నెల 6 మధ్య 8సార్లు స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో జూలై 6న డీజీసీఏ షోకాజ్ నోటీసును కూడా స్పైస్‌జెట్‌కు ఇచ్చింది.